గాంధారి ఫిబ్రవరి 18: వేసవిని దృష్టిలో ఉంచుకొని రోడ్లకు ఇరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు నీళ్లు పోయాలని కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్(Ashish Sanghwan) అన్నారు. మంగళవారం పెట్ సంఘం గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించి ట్యాంకర్ సాయంతో నీళ్లు పట్టారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని మొక్కలు ఎండిపోకుండా ట్యాంకర్ సాయంతో నీరు పోయాలని అధికారులను ఆదేశించారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటించాలన్నారు.
మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని ఆయన పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను జూన్ మాసంలోపు నాటడానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండల నుంచి రక్షించడానికి నర్సరీలోని మొక్కలకు గ్రీన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని కంపోస్టు షెడ్‌ను పరిశీలించి ఆయన, తడి పొడి చెత్తను వేరుచేసి వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేయాలని సూచించారు. గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్‌లో వేయకుండా దూర ప్రాంతాలకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారిని లక్ష్మీ ప్రసన్న, తాసిల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీఓ లక్ష్మీనారాయణ తదితరులున్నారు.