కామారెడ్డి రూరల్ : శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన గణిత ఒలింపియాడ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2025 లో చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తములుగా నిలిచిన నిహారిక, నిఖిల, సాయి చరణ్‌లు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఈ పురస్కారాలు అందుకున్నారు.
సత్తా చాటిన విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన గణిత ఉపాధ్యాయులు శ్రీ విజయగిరి రామకృష్ణను ప్రధానోపాధ్యాయులు శ్రీ కే సాయిరెడ్డి, ఇతర ఉపాధ్యాయ బృందం అభినందించారు. చుక్కా రామయ్య మార్గదర్శకత్వంలో సంస్థ అధ్యక్షులు తుమ్మ అమరేష్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఒలింపియాడ్ పరీక్షలను నిర్వహించి ప్రోత్సహిస్తున్నారు.
విద్యార్థులలో అంతరంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి పోటీ పరీక్షలు అంటే భయాన్ని పోగొట్టాలనే సదుద్దేశంతోనే ఈ ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి చెప్పారు. ఇలాంటి పరీక్షలు రాయడాన్ని విద్యార్థులు అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇటువంటి ఒలంపియాడ్ పరీక్షలు రాస్తే భవిష్యత్తులో ఏ పరీక్ష లోనైనా సులభంగా విజయం సాధించవచ్చు అని తెలిపారు.
గణితానికి విద్యార్థులు భయపడొద్దని, నేర్చుకుంటే అది చాలా సులభమని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పోటీ పరీక్షలు రాయడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా అర్థమెటిక్, రీజనింగ్‌లను కూడా ప్రత్యేకంగా నేర్చుకోవడంవల్ల సులభంగా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు.