కామారెడ్డి: పట్టణంలోని సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న ఓ వ్యాపారీ ( Businessman ) అప్పులు తీసుకుని సుమారు 2 కోట్లతో ఉడాయించిన ఘటన కామారెడ్డిలో (Kamareddy) కలకలం రేపుతుంది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద అబీబ్ అనే వ్యక్తి మెగా మార్ట్ (Megamart) నెలకొల్పాడు. పలువురు వ్యక్తుల వద్ద వివిధ పనుల నిమిత్తం భారీగా డబ్బులు తీసుకున్నాడు. షాప్లో పని చేసే మహిళా సిబ్బంది వద్ద కూడా బంగారం తీసుకున్నాడు.
సుమారు 2 కోట్ల వరకు తీసుకుని 40 రోజులుగా షాప్ మూసేసి ముఖం చాటేశాడు. చివరికి సూపర్ మార్కెట్కు సరుకులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లకు సైతం డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టుగా సమాచారం. శనివారం బాధితులు షాప్ వద్ద భారీగా చేరుకున్నారు. షాపులో విలువైన సామగ్రి మొత్తాన్ని ముందే తరలించారు. దాంతో డిస్ట్రిబ్యూటర్లు వచ్చి మిగిలిన సామగ్రిని తమ వెంట తీసుకెళ్లారు.
40 రోజులుగా షాప్ మూసి ఉండటంతో అనుమానం వచ్చిన కొందరు బాధితులు ఈ విషయమై కొద్ది రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సదరు వ్యాపారి ఐపీ పెట్టి పారిపోయినట్టుగా తెలుస్తోంది. కామారెడ్డి పట్టణంలో వ్యాపారం పేరుతో అప్పులు తీసుకుని బాధితులను నిండా ముంచిన ఘటనల్లో ఇది ఆరవది.