బాన్సువాడ రూరల్, మార్చి 11: వేసవి కాలం నేపథ్యంలో పల్లె ప్రకృతి వనం నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ గ్రామపంచాయతీ కార్యదర్శి దయానంద్ కు సూచించారు. మండలంలోని మొగులానిపల్లి తండా గ్రామంలోని నర్సరీని ఆయన మంగళవారం పరిశీలించారు. నర్సరీలో తెచ్చుకున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
డంపింగ్ యార్డ్లో తడి, పొడి చెత్త సేకరణపై ఎంపీడీవో ఆరా తీశారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు నీళ్లు పట్టించాలని ఆయన సూచించారు. గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ లోనే వేయించాలని అన్నారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పని అడిగిన ప్రతికూలికి ఉపాధి హామీ పనులు కల్పించాలని, పని ప్రదేశం వద్ద కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించాలని కార్యదర్శికి సూచించారు. గ్రామంలో పన్నులు వందశాతం వసూలు చేయాలని ఆయన అన్నారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.