ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను మించిన రాష్ట్రం
రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం
సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదు..
బీర్కూర్ ఆగస్టు 30 : ప్రతి రైతు ధనవంతుడు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్, బీర్కూర్ తండా గ్రామాల్లో సోమవారం పలు అభివృద్ధి పనుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తిమ్మాపూర్‌లో ప్రాథమిక పాఠశాలలో అదనపు గదులు, ప్రహరీ నిర్మాణానికి, పోచారం కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, పద్మశాలీ సంఘ భవనం, బత్తిని సంఘ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బీర్కూర్ తండాలో 15 డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. రామారావు మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రం కన్నా మన రాష్ట్రం ముందు వరుసలో ఉన్నదన్నారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. ఎస్డీఎఫ్ నుంచి నియోజకవర్గ అభివృద్ధికి రూ.89 లక్షలు తీసుకొచ్చానన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయనను విమర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతుబంధు, రైతు బీమా, డబుల్ బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్ల లాంటి పథకాలు లేవన్నారు. కార్యక్రమానికి ఆయా గ్రామాల సర్పంచులు కొరిపెల్లి రామకుమారి, దేవీబాయి అధ్యక్షత వహించారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ద్రోణవల్లి సతీశ్, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, వైస్ ఎంపీపీ కాశీరాం, ఎంపీటీసీ ఢీకొండ సావిత్రి, సొసైటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, డీఎస్పీ జైపాల్‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో రాధమ్మ, పార్టీ మండలాధ్యక్షుడు లాడేగాం వీరేశం, యువత అధ్యక్షుడు మియాపురం శశికాంత్, నాయకులు పాల్గొన్నారు.