ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రోడ్డు నిర్మాణ
పనులను పరిశీలించిన కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
సదాశివనగర్, నవంబర్, 29: లింగంపల్లి, జనగామ గ్రామాల పట్టాదారుల, రైతులకు త్వరలోనే భూములను చూపిస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాలో చేపట్టనున్న జ్యూట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు కోసం ప్రభుత్వ భూమిని ఎంపిక చేయగా రోడ్డు పనులు ప్రారంభమైనట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ అధికారులతో కలిసి జనగామ, లింగంపల్లి, కరడ్‌పల్లి గ్రామాల శివారులో నిర్మిస్తున్న రోడ్డు పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భూముల పట్టాలు ఉన్న రైతులు తమ భూములు యూనిట్లో కోల్పోతున్నామని కలెక్టర్‌కు తెలిపారు. దీంతో స్పందించిన కలెక్టర్ రైతుల భూముల వివరాలను సేకరించి మరోచోట పంటలు పండే భూములను చూపించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. లింగంపల్లి, జనగామ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, కోతుల ఆహార శాలల భూములు యూనిట్లో పోతుండడంతో ఈ భూములు వదిలిపెట్టి యూనిట్ పనులు చేయించాలని తహసీల్దార్ వెంకట్రావుకు సూచించారు. ఫుడ్ యూనిట్ కోసం రోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు త్వరలోనే మరో చోట భూములు చూపిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, సదాశివనగర్ తహసీల్దార్ వెంకట్రావు, గిర్దావర్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రాజెక్టు ఇంజినీర్ శివకృష్ణ, పట్టాదారు రైతులు తదితరులు పాల్గొన్నారు. లింగంపల్లి గ్రామ శివారులో తన భూమిని రోడ్డు పనుల్లో కోల్పోతున్నానని గ్రామానిక చెందిన కామిండ్ల లింగయ్య అనే రైతు రోడ్డు నిర్మాణ పనుల జరిగే చోట కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించాడు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకట్ రావు అక్కడికి వెళ్లి రైతుతో మాట్లాడి వివరాలు సేకరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మరో చోట భూములు చూపిస్తామన్నారు. దీంతో రైతు లింగయ్య కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బాల్య వివాహాలు జరుగకుండా చూడాలి
బాల్య వివాహాలు జరుగకుండా చూడాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా బాలల రక్షణ యూనిట్ జిల్లా లెవెల్ కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగితే 1098 నంబర్ సమాచారం ఇవ్వాలని సూచించారు. అనాథ బాలలకు రక్షణ కల్పించాలన్నా రు. బాలకార్మికులు, బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామస్థాయిలో కళాజాత ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించేలా చూడాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో బలహీనమైన పిల్లలకు అదనంగా పౌష్టికాహారం అందేలా చూడాలని సూచించారు. ఎస్పీ శ్వేత మాట్లాడుతూ.. బాల కార్మికులతో ఎవరైనా పనులు చేయిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మహిళా, పిల్లల, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి సరస్వతి, సీడబ్ల్యూసీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, బాలల రక్షణ అధికారిణి స్రవంతి, ఇన్చార్జి డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, సీడబ్ల్యూసీ మెంబర్ స్వర్ణలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.