పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ..
కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం‘నమస్తే తెలంగాణ’తో టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్
కామారెడ్డి, జనవరి 29 : ‘క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తా. ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉంటూ పార్టీ లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోతాం’ అని టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంకే ముజీబుద్దీన్ తెలిపారు. పార్టీ జిల్లా సారథ్య బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంస్థాగత విషయాలను, భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.
గులాబీ జెండా మోసే ప్రతి కార్యకర్తకూ టీఆర్ఎస్ అండగా ఉంటుంది. అటు ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. ఇటు పార్టీ అమలు చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను పాటిస్తాం. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో పార్టీ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తాం. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తాం. కార్యకర్తలకు అందుబాటులో ఉండడంతోపాటు పార్టీకోసం పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ‘నమస్తే తెలంగాణ’తో టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్.
నమస్తే : జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై ఎలా ఫీలవుతున్నారు ?
ముజీబుద్దీన్ : సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా మీద నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించారు. మరింత బాధ్యత పెరిగింది, సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తా. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తాం.
పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీముందుండే లక్ష్యాలేమిటి?
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేస్తాం. మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తా.ఎన్నిక ఏదైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్తను సిద్ధం చేయడమే లక్ష్యం. గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీ సమావేశాల్లో స్వయం పాల్గొంటా.
జిల్లాలో పార్టీ కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకెళ్తారు?
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 90శాతానికిపైగా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్కు చెందినవారే ఉన్నారు. మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్‌షిండే ఆదేశాల మేరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను నిర్వహిస్తాం. పార్టీకి ఎలా జవాబుదారీగా వ్యవహరించాలో ప్రతి ఒక్క కార్యకర్తకూ వివరిస్తా.
ఏ అంశాలపై పార్టీ ప్రధానంగా దృష్టి సారించనుంది?
బంగారు తెలంగాణ నిర్మాణం కోసం జిల్లాలో ఉన్న ప్రధాన వనరులను ప్రభుత్వం, పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. ఉద్యమ పునాదులపై ఆవిర్భవించిన టీఆర్ఎస్.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుంది. పార్టీకోసం పరితపించే కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం. వారికి అండగా ఉంటాం.
కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు ఉంటుంది?
పార్టీ నిర్మాణంలో కార్యకర్తలే కీలకం. టీఆర్ఎస్కు మొదటి నుంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారు. పార్టీలో కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుంది. ప్రతి కార్యకర్తకూ పార్టీ బీమా చేయిస్తుంది. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా పనిచేస్తా. రాజకీయ శిక్షణ తరగతులు, అవగాహన కార్య క్రమాలను నిర్వహిస్తాం.