కామారెడ్డి టౌన్, జనవరి 29: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రైతు కల్లాలు నిర్మించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఏపీవో, ఈసీ, సాంకేతిక సహాయకులు ప్రతి ఒక్కరూ 25 చొప్పున కల్లాలను నిర్మించేలా చూడాలని సూచించారు. కంపోస్ట్ షెడ్లు, శ్మశాన వాటికలు వినియోగంలో ఉండేలా చూడాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో వందశాతం మొక్కలు నాటాలని సూచించారు. గ్రామాల్లో మురుగు కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించి, మార్చి 31 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో వెంకట మాధవరావు, జడ్పీ సీఈ వో సాయాగౌడ్, ఆర్డీవోలు శీను, రాజాగౌడ్ పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాల్లో యువతను భాగస్వాములు చేయాలి
సేవా కార్యక్రమాల్లో యువతను భాగస్వాములు చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. పేదలకు సేవలు అందించడంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు ముందుండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకొని రక్తదాన శిబిరాలు విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న మాట్లాడుతూ.. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగేండ్లలో చేపట్టిన రక్తదానం, వైద్య శిబిరాల వివరాలను తెలియజేశారు. జిల్లాలో నాలుగు వేలకు పైగా సభ్యత్వ న మోదు చేశామని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి రాజారాం, ఈసీ మెంబర్లు పాల్గొన్నారు.