సదాశివనగర్, జనవరి 29 : డ్వాక్రా సంఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా రిలయన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ రమేశ్, సదాశివనగర్ ఐకేపీ ఏపీఎం రాజిరెడ్డి అన్నారు. మండల అధ్యక్షురాలు సరిత ఆధ్వర్యంలో మండలంలోని 16 మంది సభ్యులు కామారెడ్డి, రాజంపేట్, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామాల్లో స్వయం ఉపాధితో తయారుచేస్తున్న బొట్టు, కారం, ఫినాయిల్, యాసిడ్, మిర్చి, పాపడాలు తదితర వస్తువులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాల మహిళలకు రుణాలు అందించి వివిధ వస్తువులను తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. అడ్లూర్ఎల్లారెడ్డికి చెందిన అఖిల మహిళా సంఘం సభ్యురాలు దాసరి స్వరూపకు లక్ష రూపాయలు, స్ఫూర్తి మహిళా సంఘం సభ్యురాలు అయిండ్ల శ్వేతకు రూ. 3 లక్షల రుణం అందజేసి.. వారితో ఫినాయిల్ తదితర వస్తువుల తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. రాజంపేట్లో మిర్చి, బొట్టు తయారీ, సదాశివనగర్‌లో మధుర మీనాక్షి సంఘం సభ్యురాలు సుభాషిణి, పాండ్యా అనే మహిళలు బొంగులు, పాపడాలు తదితర తినుబండారాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు సరిత, కోశాధికారి రజిత, రాజంపేట్ ఏపీఎం సాయిలు, సీసీలు గొర్రె రాములు, అబ్బ లింగం, దర్ని ఆంజనేయులు, సౌజన్య, కృష్ణాంజలి తదితరులు పాల్గొన్నారు.