పనిదినాల కల్పనలో కామారెడ్డి జిల్లా ముందడుగు
జిల్లాలో కూలీలకు రూ.128.21కోట్ల చెల్లింపులు
2,80,982 మందికి ఉపాధి
రైతులకు ఊతం.. కూలీలకు వరం
రెక్కాడితే గాని డొక్కాడని పేదలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతగానో ఆదుకుంటున్నది. నైపుణ్యం లేని వయోజనులందరూ వలస వెళ్లకుండా నివారించి పనికల్పించడం ద్వారా కనీస వేతనం అందించేందుకు ఈ పథకం ఆసరాగా నిలుస్తున్నది. వ్యవసాయానికి అనుబంధంగా ఇందులో మార్పులు, చేర్పులు చేయడంతో అన్నదాతకూ కలిసి వస్తున్నది. యాసంగి సాగుపనులు ఊపందుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. దీంతో కూలీలకు పనిదినాలు కల్పించడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా మరోసారి నంబర్‌వన్‌గా నిలిచింది.
ఉపాధిలో చేపడుతున్న పనులు..
చెరువులు, కుంటలు, చెక్ డ్యాంల పూడికతీత, కట్ట, పంట కాల్వల మరమ్మతులు, పొలాలకు పిల్లదారులు, వన నర్సరీల్లో మొక్కల పెంప కం, ఫాంపాండ్, బావుల్లో మట్టి నింపడం, హరితహారంలో నాటి న మొక్కల సంరక్షణ, పొలాల్లో కల్లాలు, పశువుల పాకల నిర్మాణం, సీసీ రోడ్లు, డైనేజీ… తదితర పనుల ద్వారా కూలీలు లబ్ధి పొందుతున్నారు. జూలైలో అతి తక్కువ మందితో ప్రారంభమై న ఉపాధి హామీ పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో సమీక్షా స మావేశాలు నిర్వహించడం ద్వారా రోజురోజుకూ కూలీల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఏ మండలంలో తక్కువ కూలీలు వస్తున్నారనే విషయమై అధికార యంత్రాంగం దృష్టిసారించడంతో ఉపాధి పనుల్లో వేగం పెరిగింది. జిల్లాలోని 22 మండలాల్లో ఉపాధి హామీ పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో గ్రామంలో కనీసం 40మందికి ఉపాధి పని కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కూలీల పెంపునకు కసరత్తు నిర్వహించి, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీవో, పంచాయతీ కార్యదర్శి, సర్పంచులు, వార్డు సభ్యులు దృష్టి సారిం చి కూలీ కోరిన 24గంటల వ్యవధిలో పని చూ పించడంలో యంత్రాంగం విజయవంతమైంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా పరిధిలో 2,80,982 మంది కూలీలు ఉపాధి పనులు నిర్వహిస్తుండడంతో రాష్ట్రంలోనే ఉపాధి కల్పనలో మొదటి స్థానానికి చేరువైంది.
పనిదినాల కల్పనలతో టాప్..
ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనిదినాలు కల్పించడంలో కామారెడ్డి జిల్లా ముందంజలో ఉన్నది. గతంలో కన్నా ఈ ఏడాది కూలీలకు పనికల్పించడంలో అధికారయంత్రాంగం చురుగ్గా పనిచేయడంతో నవంబర్ నెల నాటికి ముందు వరుసలో నిలువడం విశే షం. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది నెలల్లో కామారెడ్డి జిల్లా పరిధిలో 32,689 పనులు మంజూరుకాగా 87,14, 564 పనిదినాలు కల్పించారు. నవంబర్ నెల నాటికి కామారెడ్డి జిల్లా వ్యాప్తం గా రూ.162. 54కోట్ల పనులకు రూ.128.2 1కోట్లు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల పరిధిలో 2,80,9 82 మంది కూలీలకు జాబ్ కార్డు ద్వారా ఉపాధి లభించగా ఇప్పటి వరకు 1,16,69,218 పని దినాలు పూర్తయ్యాయి. 2020-21 సంవత్సరానికి రూ.30365.26 కోట్ల లక్ష్యానికి రూ.185 45.26 కోట్లు కూలీలకు చెల్లించారు. ఉపాధి పనుల కల్పనలో జిల్లా పరిధిలోని మాచారెడ్డి మండలం ముందంజలో ఉండగా, ఆ తర్వాత గాంధారి, లింగంపేట, నిజాంసాగర్, రామారెడ్డి, జుక్కల్ మండలాల్లో ఎక్కువ పనులు నిర్వహించారు. కామారెడ్డి, పెద్దకొడప్గల్, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో తక్కువ పనులు చేపట్టారు.
అందరి సహకారంతో..
కూలీలకు ఉపాధి పనిదినాలు కల్పించడంలో ముందు వరుసలో ఉన్నాం. 1.16కోట్ల పనిదినాలు కల్పించి, ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రూ.128.211 కోట్ల వేతనాలు చెల్లించాం. ఎంపీడీవో, ఏపీవో, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పని చేయడంతోనే ముందంజలో ఉన్నాం. తక్కువ పనులు జరిగిన మండలాలపై ప్రత్యేక దృష్టిసారించి మూడు నెలల్లో పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం.