పలు పాఠశాలల్లో నాలుగు సంవత్సరాల కిందటే ప్రారంభం
ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరింత సంతోషం వ్యక్తంచేస్తున్న తల్లిదండ్రులు
నిజాంసాగర్, జనవరి 28: ఇంగ్లిష్ మీడియం చదువంటేనే ఖర్చుతో కూడుకున్నది.. ప్రైవేటు పాఠశాలల్లో వేలాది రూపాయలు పెట్టి చదువు‘కొనాల్సిన’ పరిస్థితి. నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఆంగ్లమాధ్యమం అందని ద్రాక్షలాంటింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్కారు బడులన్నింటిలో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిజాంసాగర్ మండలంలోని పలు ప్రాథమికోన్నత పాఠశాలలు గ్రామస్తులు, పీఆర్టీయూ సహకారంతో నాలుగేండ్ల కిందటే ఆంగ్లమాధ్యమ బోధనను అమలుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియంతో బడుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. విద్యార్థుల సంఖ్య రెట్టింపైంది. ప్రస్తుతం ప్రభుత్వమే అన్ని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయిస్తుండడంతో తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంగ్లిష్.. ఈ భాష వస్తే చాలు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా బతుకొచ్చు. అందుకో యూనివర్సల్ భాషగా పేరు పొందింది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న భాషను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించనున్నట్లు సర్కారు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరగాలంటే ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సాధించడం తప్పనిసరి. అప్పుడే గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని భావించిన నిజాంసాగర్లోని పలు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగేండ్ల కిందటే ఆంగ్ల బోధనను ప్రారంభించి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆంగ్ల బోధనతో మారిన రూపురేఖలు.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు విస్తరించనున్నాయని చెప్పవచ్చు.
విద్యార్థుల సంఖ్య రెట్టింపు..
వడ్డేపల్లి, కోమలంచ, మాగి, తున్కిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలల్లో నాలుగేండ్ల కిందట గ్రామస్తులు, పీ ఆర్టీయూ సహకారంతో ఆంగ్ల బోధనను ప్రారంభించారు. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఒకటి నుంచి ఎనిమిది తరగతు లు ఉండగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల బోధనను ప్రారంభించారు. గత సంవత్సరం వడ్డేపల్లి పాఠశాలకు ముగ్గురు, కోమలంచకు ఇద్దరు, తున్కిపల్లికి ముగ్గురు, మాగి పాఠశాలకు ఈ సంవత్సరం నలుగురు ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించింది.
కోమలంచ
కోమలంచ పాఠశాలలో ప్రస్తుతం 180 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల బోధన కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలలోఉపాధ్యాయుల కొరత లేకుండా బోధన సాగుతున్నది. గత సంవత్సరం ఉపాధ్యాయుల కొరత ఉండడంతో గ్రామస్తులందరూ కలిసి ఇద్దరు విద్యావలంటీర్లను నియమించి ఇంగ్లిష్ మీడియం కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆంగ్ల బోధనను ప్రారంభిస్తున్న విషయం తెలుసుకున్న కొమలంచ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తున్కిపల్లి
ఈ పాఠశాలను పీఆర్టీయూ దత్తత తీసుకున్నది. గ్రామస్తుల సహకారంతోపాటు దాతలు సుమారు లక్ష రూపాయలను వెచ్చించారు. అప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ఈ గ్రామం నుంచి ఏ ఒక్క పిల్లవాడు కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లడం లేదు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 140 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
విద్యావలంటీర్ల నియామకం
మా గ్రామంలోని పాఠశాలలో నాలుగు సంవత్సరాల కిందట ఆంగ్ల బోధనను ప్రారంభిస్తే ఉపాధ్యాయుల కొరత ఉండడంతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇద్దరు విద్యావలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతి నెలా వేతనాలు చెల్లించి విద్యార్థులకు చదువులు చెప్పించాం . ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఆంగ్ల బోధనను కొనసాగించనున్నారు. పైగా మౌలిక వసతులు కూడా కల్పించనున్నారు.
–సత్యనారాయణ, కోమలంచ గ్రామస్తుడు
మాగి
మాగి పాఠశాలను పీఆర్టీయూ నాలుగేండ్ల క్రితం దత్తత తీసుకున్నది. దాతల సహకారంతోపాటు గ్రామస్తులందరూ కలిసి సుమారు రెండు లక్షలను జమ చేసి ప్రొజెక్టర్‌తో పాఠాలు, ఆంగ్ల బోధనను ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. ప్రస్తుతం 120 మంది విద్యార్థులు చదువుతుండగా తాజాగా పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులు రావడంతో గ్రామస్తులతోపాటు విద్యార్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
వడ్డేపల్లి
వడ్డ్డేపల్లి పాఠశాలలో నాలుగేండ్ల కిందట ఆంగ్ల బోధనను ప్రారంభించారు. గతంలో గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలో చదువుకునేందుకు ప్రతి రోజు 50 నుంచి 80 మంది వరకు పిల్లలు వేరే గ్రామానికి వెళ్లేవారు. ఇప్పుడు వడ్డేపల్లి నుంచి ఒక్క పిల్లవాడు కూడా ప్రైవేటు బడికి వెళ్లడం లేదు. పాఠశాలో ప్రస్తుతం 160 మంది విద్యార్థులు ఉన్నారు.
మా ఊరి బడిలోనే ఇంగ్లిష్ మీడియం..
మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే ఐదో తరగతి ఇంగ్లిష్ మీడియం చదువుకుంటున్నాను. వేరే ఊరిలోని ప్రైవేటు పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఐదో తరగతి పూర్తయితే ప్రైవేటు బడికి వెళ్లాల్సి వస్తుందని భయపడ్డాను. ప్రభుత్వమే ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభిస్తుండడంతో పదో తరగతి వరకు ఎలాంటి బాధ లేదు.