దళితుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
రాష్ట్రంలో ఎక్కడైనా యూనిట్‌ను ఏర్పాటుచేసుకోవచ్చు
ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల ఎంపిక, మార్చి 30లోగా గ్రౌండింగ్
కామారెడ్డి జిల్లాలో 340 యూనిట్లు
నిజాంసాగర్ మండలానికి రూ.50కోట్లు విడుదల
‘నమస్తే తెలంగాణ’తో కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
కామారెడ్డి, జనవరి 28: ‘దళితుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఫిబ్రవరి 5లోగా యూనిట్ల ఎంపిక పూర్తి చేసి మార్చి 30లోగా గ్రౌండింగ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాం’ అని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పథకం అమలు తీరుతెన్నులను వెల్లడించారు. దళితబంధు యూనిట్‌ను రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 340 యూనిట్ల కోసం మొదటి విడుతలో రూ.34కోట్లను కేటాయించారని వెల్లడించారు. కామారెడ్డి నియోజకవర్గానికి డీపీవో, జుక్కల్‌కు జడ్పీ సీఈవో, బాన్సువాడ, ఎల్లారెడ్డికి ఆర్డీవోలను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన నిజాంసాగర్ మండలానికి ఇప్పటికే రూ.50 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు.
దళిత కుటుంబాలు సాధికారత, ఆర్థిక స్వావలంబన సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. దళితబంధు యూనిట్‌ను రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. తొలి విడుత దళితబంధు మార్చి 9లోగా అమలయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 340 యూనిట్ల కోసం మొదటి విడుతలో రూ.34కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 5లోగా యూనిట్ల ఎంపిక పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. జిల్లాలో దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల కేటాయింపు పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికలను పంపనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నోడల్ అధికారులను నియమించినట్లు చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గానికి డీపీవో, జుక్కల్‌కు జడ్పీ సీఈవో, బాన్సువాడ, ఎల్లారెడ్డికి ఆర్డీవోలను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేస్తామని వివరించారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో తుది నిర్ణయం ఎమ్మెల్యేలదే అని స్పష్టంచేశారు. దళితబంధు పూర్తి సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇద్దరు, ముగ్గురు కలిసి ఒక్కో యూనిట్‌ను ఏర్పాటుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కూరగాయలు, నర్సరీ, సెంట్రింగ్, వ్యవసాయ పనిముట్లు, మెడికల్ తదితర వాటిని ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు. భూమి, ప్లాట్ల కొనుగోలుకు ఈ పథకం వర్తించదన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.పది లక్షల ఆర్థిక సహాయం అందిస్తుండగా, ఇందులో రూ.పది వేలను దళితబంధు రక్షణ నిధికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన నిజాంసాగర్ మండలానికి ఇప్పటికే రూ.50 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. దళితబంధు అమలు తీరుతెన్నులపై కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు ఇవి..
నమస్తే: కామారెడ్డి జిల్లాలో దళితబంధు అమలు ఎలా ఉంది..?
కలెక్టర్: జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి వంద మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక జరుగనుంది. జిల్లాలో ఈ పథకం అమలుపై రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించాం. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున, బాన్సువాడ నియోజకవర్గంలో 40 మందిని ఎంపిక చేస్తాం. బాన్సువాడలోని మిగిలిన మండలాలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నందున అక్కడ వారికి యూనిట్లు మంజూరవుతా యి. పథకం అమలులో లబ్ధిదారులకే ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇచ్చింది. దళితబంధులో ఇప్పటివరకు ఉన్న యూనిట్లను ప్రామాణికంగా తీసుకొని వివిధ కేటగిరీలుగా విభజన చేస్తామన్నారు.
పథకం అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉండబోతుంది..?
దళితబంధు లబ్ధిదారుల ఎంపికకు తొలి ప్రాధాన్యత ఇచ్చి యూనిట్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ యూనిట్‌ను ఎక్కడ పెట్టుకోవాలనే విషయాలపై లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. స్థానిక పరిస్థితులు, ప్రాంతాలను బట్టి యూనిట్లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ క్షేత్ర స్థాయిలో కార్యాచరణను ప్రారంభించింది. నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సందర్భంగా ఇప్పటికే అందరికీ బ్యాంకు అకౌంట్లను తెరిచేలా చర్యలు చేపట్టాం. వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసి యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కమిటీలను నియమించి నోడల్ అధికారి పర్యవేక్షణలో అమలు చేయనున్నాం.
పథకం అమలుకు కో-ఆర్డినేషన్ మీటింగ్ ప్లాన్ ఏమిటీ..?
కలెక్టర్: జిల్లాలో దళితబంధు పథకంపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి అధికారులతో కూడిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించాం. సమావేశంలో దళితబంధు తీరు తెన్నులు, లబ్ధిదారులు, యూనిట్ల ఎంపిక తదితర అంశాలపై కూలంకశంగా చర్చించడం జరిగింది. మంత్రి, విప్, ఎమ్మెల్యేలు పలు సూచనలు చేశారు. పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లు, గ్రౌండింగ్ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా మరికొన్ని సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది.
లబ్ధిదారుల ఎంపిక ఎప్పటివరకు జరుగనుంది..?
దళితబంధుతో నిరుపేద, షెడ్యూల్డ్ కులాల వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. యూనిట్ల ఎంపికను ఫిబ్రవరి 5లోగా పూర్తిచేసి మార్చి 9వ తేదీలోగా గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పథకానికి ఎంపికైన వారందరూ మార్చి 31లోగా యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోనున్నాం. లబ్ధిదారుల ఎంపిక పూర్తి బాధ్యతలను నియోజకవర్గ ఎమ్మెల్యేలకే ప్రభుత్వం అప్పగించింది. ఎంపిక చేసుకునే యూనిట్ల విషయంలో లాభనష్టాలు, నిర్వహణ, అనుకూల, ప్రతికూలతలు లబ్ధిదారులకు వివరిస్తాం. నిపుణులతో కలిసి వారికి సలహాలు, సూచనలు అందిస్తాం. ఎంపికలను త్వరగా పూర్తిచేసేందుకు కసరత్తు ప్రారంభించాం.