విద్యానగర్, జనవరి 24 : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది. దేశాభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసేవారిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచేస్తుంది. ఓటు హక్కును పొందడానికి పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే. అర్హులైన వారు ఓటు హక్కు పొందడానికి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. చదువుకున్న యువత సకాలంలో ఓటు హక్కు పొందితే దీనికి మరింత సార్ధకత చేకూరుతుంది. దేశప్రగతికి నిస్వార్థంగా పనిచేసేవారిని ఎన్నుకోవడానికి ఓటు చక్కటి మార్గం. భారత రాజ్యాంగం 15వ భాగంలో 326వ నిబంధన ద్వారా దీన్ని కల్పించింది. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయస్సు 18 ఏండ్లకు తగ్గించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా ఎన్నికల సంఘం కృషి చేస్తున్నది. దేశంలో పార్లమెంట్, శాసనసభలకు ఐదేండ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1980 వరకు వయోజనుల ఓటు హక్కు 21 ఏండ్లుగా ఉండేది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఓటుహక్కును 18 ఏండ్లకు కుదించారు.
యువత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
నోటు మాటున ఓటు వేయకుడా ప్రజాస్వామ్యాన్ని కాటేయకుండా ఉండే నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రతి ఒకరూ కృషిచేయాలి. అభ్యర్థి గత గుణగణాలను గుర్తుంచుకొని ఓటు వేయాలి. అవినీతిపరుల ఆట కట్టించడానికి ఓటు పనిచేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే కావడంతో నాయకులను ఎంపిక చేసుకునే హక్కు ఉంది. యువత నా ఓటు లెక్కలోకి రాదని కాకుండా ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపించేందుకు తప్పనిసరిగా ఓటు వేయాలి. ఒక్కరోజు ఓటు వేయకపోతే ఐదేండ్లపాటు బాధపడాల్సి ఉంటుంది. దేశంలో వచ్చే ప్రతి మార్పు యువత భవిష్యత్‌పై ప్రభావం చూపుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే అన్న అవగాహన అందరిలో రావాలి. తెలియనివారికి ఓటు హక్కు గొప్పదనంపై యువకులు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలి.