నాటి యాసంగి పంటలే నేడు అవసరం
వరికి బదులు ఈ పంటలే మేలు
కేంద్రం వరి కొనలేమంటున్న వేళ ప్రత్యామ్నాయం ఆవసరం
భూసారానికి దోహదం
కమ్మర్పల్లి, నవంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సౌకర్యాన్ని గణనీయంగా పెంచడంతో వరి పంటల దిగుబడులు పుష్కలంగా వస్తున్నాయి.రైతులు ఈ ఆనందంలో ఉన్నారు. కానీ వారి ఆనందం ఆవిరయ్యేలా కేంద్రం వరి కొనలేమని చెబుతున్నది. దీంతో రైతుకు ఎడతెగని వర్రీ పట్టుకున్నది. వడ్లు కొనలేమని కేంద్రం మొండికేసి కూర్చున్న వేళ.. వరి దిగుబడులు తెగ పెరిగిపోతున్న తరుణంలో యాసంగిలో ఆరుతడి పంటల సాగు అవసరం రైతు ముందుకు వచ్చింది. దీంతో ఒకప్పుడు రంది లేకుండా సాగిన ఆరుతడి పంటల వ్యవసాయం ఆనాటి పెద్ద మనుషుల కండ్ల ముందు కనబడక మానదు. ఆనాటి ఆరుతడి పంటల సాగు తప్పనిసరైన తరుణం వచ్చేసిందన్న మైండ్‌సెట్ రైతుల్లో పెరగాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వరి అతిసాగుతో ఇబ్బందులు..
జిల్లాలో దాదాపు 25 సంవత్సరాల క్రితం వరకు ఆరుతడి పంటల సాగు జరిగేది. వానకాలం వరి కోతలు పూర్తవ్వగానే నీటి సౌకర్యమున్న చోట ల్లా ఆరుతడి పంటలనే వేసుకునే వారు. దీంతో భిన్న పంటల సాగు, చీడపీడలు.. భూసార నష్టం లాంటి సమస్యలు కనిపించేవి కావు. మార్కెట్లో ఎప్పటికప్పుడు డిమాండ్ ఉన్న పంటలపై అవగాహన..పంట మార్పిడి సరళి, సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి ఉండేవి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉపయోగించి 1965-1995 మధ్యకాలంలో మంచి దిగుబడులు సాధించారు. అనంతరం ఈ రసాయన ఎరువులు, పురుగు మందుల అతి వినియోగంతో వరి సాగు అతి కావడానికి దారి తీసింది. జిల్లాలో ఆర్మూర్, బోధన్ ప్రాంతంలో యాసంగిలో తప్పనిసరిగా కనిపించే శనగ, పెసర, కంది, నువ్వులు, వేరుశనగ, ఆవాలు, మినుములు, సజ్జ పంటలను వరి సాగు ఆక్రమిస్తూ వచ్చేసింది. దీంతో వరి పెరిగి ఆరుతడి పంటలు తగ్గాయి.
మారిన ఆహార వినియోగం..
ఆరుతడి పంటలకు మద్దతు దొరికినా, మార్కెట్ డిమాండ్ ఉన్నా వరి మోజు వాటిని కనిపించకుండా చేశాయి. ఉదాహరణకు జొన్న రవ్వ, గటుక, రొట్టెలు, అంబలి, రాగి మాల్ట్, లాంటి వాటి వినియోగం నేడు తిరిగి బాగా పెరుగుతూ వస్తున్నది. కార్పొరేట్ కంపెనీలు వీటినే అందమైన ప్యాకింగ్‌లో మార్కెట్ చేస్తున్నది. అంటే మళ్లీ జొన్న, రాగులు తదితర ధాన్యాల సాగు ఆవశ్యకత పెరుగుతున్నదని చెప్పుకోవచ్చు. వరి తీసుకోలేమని కేంద్రం ప్రకటనలు ఉపద్రవంలా వచ్చి పడ్డ ఇలాంటి సమయంలోనైనా.. ఈ యాసంగిలో గతంలో జిల్లాలో సాగు చేసిన శనగ, వేరు శనగ, నువ్వులు, ఆనుములు, ఆవాలు, పొద్దు తిరుగుడు, సజ్జ, పెసర్లు, కందులు, పత్తి, ఉలవలు లాంటి వాటి సాగు చేసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.