రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితుల దుర్మరణం
ఒకరికి తీవ్ర గాయాలు
అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
వేల్పూర్ మండలం మోతె శివారులో ఘటన
రెండు గ్రామాల్లో విషాదం
వేల్పూర్, నవంబర్ 23: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె శివారులో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ఇద్దరు ప్రాణ మిత్రులను బలి తీసుకున్నది. ఎస్సై భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భీమ్‌గల్ మండలం బాచన్పల్లి, పిప్రి గ్రామాలకు చెందిన మనోజ్, శ్రావణ్, భరత్ పనినిమిత్తం సోమవారం కారులో ఆర్మూర్‌కు వెళ్తున్నారు. ఈక్రమంలో వారు వేల్పూర్ మండలంలోని మోతె శివారులోకి రాగానే కారు అదుపుతప్పి తాటి చెట్టును ఢీకొన్నది. దీంతో తీవ్ర గాయాలైన కారునడుపుతున్న మనోజ్(22), వెనుక కూర్చున్న శ్రావణ్(21) అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న భరత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. క్షతగాత్రుడిని ఆర్మూర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
రెండు గ్రామాల్లో విషాదం..
భీమ్‌గల్, నవంబర్ 23: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందడంతో మండలంలోని బాచన్పల్లి, పిప్రి గ్రామాల్లో విషాదం నెలకొన్నది. నెల్లూరు జిల్లా కోడూరుపాడుకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి వృత్తిరీత్యా భవన నిర్మాణాలు చేయిస్తుంటాడు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం 25 ఏండ్ల క్రితం పిప్రి గ్రామానికి వలస వచ్చి ఇక్కడే నివా సం ఉంటున్నది. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా.. మనోజ్(22) ఇటీవల బీటెక్ పూర్తిచేశా డు. అతడికి ఇటీవలే ఉద్యోగం కూడా రావడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అతడు సోమవారం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాడని, బుధవారం వెళ్లాల్సి ఉన్నదని, ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. జీవితంలో స్థిరపడాల్సిన వయస్సులో మనోజ్ మృతిచెందడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. అతడి మృతదేహాన్ని వారి స్వగ్రామం నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గంలోని కోడూరుపాడుకు మంగళవారం తరలించారు.
బాచన్పల్లికి చెందిన శెట్టి గంగాదాస్కు ఇద్దరు సంతానం. ఇటీవల కూతురు వివాహం చేశాడు. కుమారుడు శ్రావణ్(21) డిగ్రీ పూర్తి చేసి పై చదువుల కోసం సిద్ధమవుతున్నాడు. అతడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. బాధిత కుటుంబాలను పలువురు ఓదార్చారు.