నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా భూసేకరణ
జాతీయ రహదారి, రైల్వే కనెక్టివిటీతో ప్రయోజనాలు
రూ.303 కోట్లతో జ్యూట్ పరిశ్రమల స్థాపనకు చకచకా ఏర్పాట్లు
స్థానికులకు ఉపాధి, రైతులకు మేలు చేయడమే లక్ష్యంగాత్వరలోనే పరిశ్రమలు
నిజామాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. అనుబంధ పరిశ్రమల స్థాపనపైనా దృష్టి సారించింది. రైతులను లాభాల బాట పట్టించడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి మార్గాలు చూపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో టీఎస్ఐఐసీ భారీగా భూములను సేకరించింది. జాతీయ రహదారి-44, రైల్వేలైన్‌కు సమీపంలో పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉండే ప్రభుత్వ భూమిని ఇందుకోసం కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో ఒకేచోట 250 ఎకరాల భూమిని, కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లోని నాలుగు గ్రామాల్లో 675 ఎకరాలను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వం సేకరించింది. ఇప్పటికే పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ‘కాళేశ్వరం ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్’ ఏకంగా రూ.303 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మరిన్ని కంపెనీలు వరుసకట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వ్యాపా ర, వాణిజ్య అవకాశాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు కనెక్టివిటీ ఉన్న జాతీయ రహదారిని కలిగి ఉన్న ప్రాంతాలను ఇండస్ట్రియల్ కారిడార్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా కీలకమైన నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా ల్యాండ్ బ్యాంకు ను టీఎస్ఐఐసీ సిద్ధం చేసింది. జాతీయ రహదారి 44, రైల్వే లైన్‌కు సమీపంలో పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉండే ప్రభుత్వ భూమిని ఇందుకోసం కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. విలువైన భూమిని భారీగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను ఉమ్మడి జిల్లాకు తరలించే ఆలోచన లో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో కాళేశ్వ రం ఆగ్రో ఇండస్ట్రీస్ ఏకంగా రూ.303 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం తో ఒప్పందాలు చేసుకోవడంతో మరిన్ని కంపెనీలు ఉత్తర తెలంగాణ బాట పట్టేందుకు రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
925 ఎకరాలతో భూనిధి…
పరిశ్రమలు తరలి రావాలంటే అనువైన ప్రాంతా లు అందుబాటులో ఉండాలి. రవాణాకు వీలుగా రోడ్డు, రైల్వేతో పాటు గగనతల అవసరాలు దగ్గర్లో ఉంటే సులువుగా పెట్టుబడులు వస్తాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్నాయి. ఔటర్ రింగ్ రో డ్డుకు కామారెడ్డి జిల్లా 84 కిలో మీటర్లు దూరంలో నెలకొంది. నిజామాబాద్ జిల్లా దాదాపు 140 కిలో మీటర్లలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ కేవలం 3 గంటల సమయం పడుతుంది. పారిశ్రామికవేత్తలకు ఇది కలిసి వచ్చే అంశమే. భవిష్యత్తులో జక్రాన్‌పల్లి ఎయిర్ స్ట్రిప్ సౌకర్యం అందుబాటులోకి వస్తే పారిశ్రామికీకరణకు ఈ ప్రాంతం ఎంతగానో ఉపకరిస్తుంది. గగనతల సౌకర్యంతో పాటు జాతీయ రహదారి 44 అనువుగా ఉన్న జిల్లాలివి. మరోవైపు పటిష్టమైన రైల్వే వ్యవస్థ కలిగి ఉండడంతో పారిశ్రామిక వృద్ధికి ఈ ప్రాంతం ఎంతగానో ఉపకరించనున్నది. ఇందులో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో ఒకే చోట 250 ఎకరాల భూమిని, కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్, తా డ్వాయి మండలాల్లోని నాలుగు గ్రామాల్లో 675 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఎన్‌హెచ్ 44కు కూత వేటు దూరంలో సదాశివనగర్ మండలంలో 440.25 ఎకరాలు, లింగంపల్లిలో సర్వే నంబర్ 79లో 321 ఎకరాలు, జనగాం గ్రామంలోని సర్వే నంబర్ 12లో 43.09 ఎకరాలు, సర్వే నంబర్ 74లో 75.29 ఎకరాలు గుర్తించారు. తాడ్వాయి మండలంలోని ఖరడ్పల్లిలో సర్వే నంబర్ 387 నుంచి 393 వరకు 234.17 ఎకరాలు ఫుడ్ ప్రాసెసింగ్ కోసం టీఎస్ఐఐసీకి బదలాయించారు.
రూ.303 కోట్లతో పెట్టుబడుల రాక…
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో జ్యూట్ పరిశ్రమ స్థాపించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వంతో సెప్టెంబర్ 17న ఒప్పందం కుదుర్చుకున్నాయి. జ్యూట్ పరిశ్రమ ఏర్పాటు కోసం కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్ ఏకంగా రూ.303 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ పరిశ్రమ ఏ ర్పాటుతో జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన సుమారు 3600 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జ్యూట్ పరిశ్రమ స్థాపించడం ద్వారా సంప్రదాయ వరి పంటను సాగు చేస్తున్న రైతులంతా ఒక్కసారిగా జనపనార సాగు కు మొగ్గు చూపే ఆస్కారం ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా డి మాండ్ పెరిగి రైతులకు అధిక లాభాలు దక్కే అవకాశం ఏర్పడనున్నది. జనపనారను స్థానికంగానే సంబంధిత పరిశ్రమ కొనుగోలు చేయడం ద్వారా ముడి సరుకు ఇబ్బందులు సంబంధిత కంపెనీలకు తీరనున్నది. టీఎస్ఐఐసీకి భూమి బదలాయింపు జరిగి ఐదు నెలలు కాకుండానే భారీ పరిశ్రమ తరలిరావడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ఆగ్రో కంపెనీ బాటలో మరిన్ని సంస్థలు తరలిరానున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి.
నలుదిక్కులా తెలంగాణ బ్రాండ్…
వరి, పసుపు, మక్కజొన్న, పత్తి, కూరగాయలు, అపరాల సాగులో ప్రాధాన్యతను కలిగిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూని ట్ల స్థాపనతో రైతులకు మేలు జరగనున్నది. ప్రస్తు తం పండించిన పంటకు మద్దతు ధర దొరకని పక్షంలో రైతులు దిగాలు చెందాల్సిన దుస్థితి ఏర్పడింది. పైగా, వ్యవసాయ మార్కెట్లలో దళారులే వీరి కష్టార్జితాన్ని దోచేస్తున్నారు. రైతుల శ్రమకు మిగులుతున్న ఫలితం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుతో రైతులకు నేరుగా లాభం చేకూరే అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. ఉదాహరణకు ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గంలో పసుపు, మక్కజొ న్న, అపరాలు, కూరగాయల సాగుకు ప్రసిద్ధి. ఇక్క డి రైతులు శ్రమకోర్చి పండించిన తమ పంటను మార్కెట్‌కు తీసుకెళ్లి బొటాబొటిన పలికే ధరకే అమ్ముకుని తిరిగి రావాల్సి వస్తున్నది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఇక్కడ నెలకొల్పే పంటల ఆధారిత పరిశ్రమలతో రైతులకు అధిక మొత్తంలో లాభం జరిగే వెసులుబాటు కలుగుతుంది.
దీంతో ఒక పంటకు డిమాండ్ ఉన్న లేకు న్నా వాటికున్న ప్రాధాన్యతను బట్టి వాటి కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగే వీలు కలుగుతుంది. ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను తెలంగాణ వ్యాప్తంగా స్థాపించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ చేకూరనున్నది. సాగు జిల్లాలుగా పేరుగాంచిన నిజామాబాద్, కామారెడ్డిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ఆస్కారం ఏర్పడబోతున్నది.