మాచారెడ్డి/ సదాశివనగర్, నవంబర్ 22 : మాచారెడ్డి మండలంలోని లచ్చాపేట, సదాశివనగర్ మండలంలోని జనగామ, లింగంపల్లి, కరడ్‌పల్లి గ్రామ శివారుల్లో జ్యూట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం స్థలంతోపాటు రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. లచ్చాపేట గ్రామ శివారులో సర్వేనంబర్ 290 నుంచి 297 వరకు ఉన్న 170 ఎకరాల భూమిని అందుబాటులో ఉంచి స్థలాన్ని సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పడితే స్థానికులకు ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు. అనంతరం జనగామ, లింగంపల్లి, కరడ్‌పల్లి గ్రామ శివారుల్లో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. యూనిట్ సేకరణలో తమ పట్టాభూములు పోతున్నట్లు కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రైతుల భూముల వివరాలను సేకరించి, మరోచోట భూములు చూపించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లింగంపల్లి, జనగామ గ్రామాలకు చెందిన పల్లె ప్రకృతివనం, కోతుల ఆహారశాలల భూములు పోతున్నట్లు సర్పంచులు కలెక్టర్‌కు వివరించారు. దీంతో ఆయన వాటికి సంబంధించిన భూములను వదిలిపెట్టి యూనిట్ పనులు చేయించాలని తహసీల్దార్ వెంకట్రావుకు సూచించారు. స్థల సేకరణలో భూముల కోల్పోయిన రైతులకు మరోచోట భూములు చూపిస్తామన్నారు. కలెక్టర్ వెంట ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్ రామదాసు, ఇన్చార్జి ఆర్డీవో శ్రీను, ప్రాజెక్ట్ ఇంజినీర్ శివకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ప్రాజెక్టు ఇంజినీర్ శివకృష్ణ తదితరులు ఉన్నారు.