నిజామాబాద్ రూరల్/ ఇందూరు, నవంబర్ 22 : సమాజంలో ప్రతిఒక్కరినీ సన్మార్గం వైపు నడిపించేది దైవభక్తియేనని దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని గంగస్థాన్ ఫేస్-2 ప్రాంతంలో ఉన్న ఉత్తర తిరుపతి క్షేత్రంలో సోమవారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామీజీ సమక్షంలో శ్రీచక్రపూజ, రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు కొనసాగాయి.
వైభవంగా శివపార్వతుల కల్యాణం
సాయంత్రం శివపార్వతుల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులనుద్దేశించి స్వామీజీ ప్రవచనాలు చేశారు. ప్రతిఒక్కరూ భక్తి భావం అలవర్చుకుని నిత్యం భగవంతుడిని ధ్యానించాలన్నారు. రోజు ఆలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకుంటే మనస్సుకు ఉల్లాసంతోపాటు ప్రశాంతత కలుగుతుందని చెప్పారు. దైవభక్తి మార్గంలో నడిచిన వారందరూ దురలవాట్లకు దూరమై తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవనం సాగించే అవకాశముంటుందని పేర్కొన్నారు. అనంతరం స్వామీజీని ఆలయ ట్రస్టీ, నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆల య ట్రస్టీ సంపత్‌కుమార్, పంచాయతీరాజ్ రిటైర్డ్ ఈఈ జలంధర్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.