పిట్లం/ నాగిరెడ్డిపేట్/ మద్నూర్/లింగంపేట, నవంబర్ 22 : జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లోని అభివృద్ధి పనులను అధికారులు సోమవారం పరిశీలించారు. పిట్లం మండలకేంద్రంలోని బృహత్ ప్రకృతివనాన్ని ఎంపీడీవో వెంకటేశ్వర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బృహత్ ప్రకృతివనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రకృతివనంలో 31 వేల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటివరకు 25 వేల మొక్కలు మాత్రమే నాటారని అన్నారు.
ఉపాధిహామీ కూలీలతో ప్రకృతివనంలో పండ్లు, పూల మొక్కలను నాటించారు. ఆయన వెంట ఏపీవో శివకుమార్, ఎంపీవో బ్రహ్మం, పంచాయతీ కార్యదర్శి విఠల్‌రెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ జొన్న శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధిహామీ సిబ్బంది ఉన్నారు.
పోడుభూముల దరఖాస్తులు..
నాగిరెడ్డిపేట్ మండలంలోని 13 గ్రామాల నుంచి వస్తున్న పోడుభూముల దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు ఎంపీడీవో రఘు సోమవారం తెలిపారు. వివిధ గ్రామాల నుంచి సోమవారం వరకు 125 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇందులో దళితులు 14 మంది, 111 ఇతరులు ఉన్నట్లు తెలిపారు.
పల్లెప్రగతి పనులు..
మద్నూర్ మండలంలోని కుర్లా, డోంగ్లి, ధోతి, మొఘ, మేనూర్ గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో వెంకటనర్సయ్య పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని పల్లెప్రకృతివనం, వైకుంఠధామం, రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు.
పల్లెప్రకృతి వనాలు..
లింగంపేట మండలంలోని సురాయిపల్లి, ఎల్లమ్మ తండాలోని పల్లెప్రకృతి వనాలను ఎంపీవో ప్రభాకర్ చారి పరిశీలించారు. మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు భీంరెడ్డి, సాహితి ఉన్నారు.