ఎల్లారెడ్డి/నిజాంసాగర్/దోమకొండ, అక్టోబర్ 22 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతున్నది. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సోమవారం 13 మందికి ఫస్ట్ డోస్, 18 మందికి సెకండ్ డోస్ టీకాలను వేశారు. 19 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. మత్తమాల పీహెచ్సీ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో 267 మందికి వ్యాక్సిన్ వేసినట్లు మెడికల్ ఆఫీసర్ వెంకటస్వామి తెలిపారు. మత్తమాలలో ఆరుగురికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ రిపోర్టులు వచ్చినట్లు వెల్లడించారు. నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామ పంచాయతీలో టీకాల శిబిరాన్ని ఏర్పాటుచేశారు. గ్రామంలోని 165 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. శిబిరాన్ని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్ పరిశీలించారు. గ్రామంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని, ప్రస్తు తం రెండో డోస్ టీకాలు ఇస్తున్నారని తెలిపారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి గంగాసాగర్ ఉన్నారు. దోమకొండ మండల కేంద్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ఎంపీడీవో చెన్నారెడ్డి సోమవారం పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వందశాతం టీకాలు వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం పల్లెప్రగతి పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మొక్కల సంరక్షణపై పలు సూచనలు చేశారు. ఎంపీడీవో వెంట సర్పంచ్ అంజలి, ఎంపీవో తిరుపతి, పంచాయతీ సెక్రటరీ సౌజన్య ఉన్నారు.