విక్రయంతో రైతులకు ఉపాధి
తక్కువ విస్తీర్ణంతో ఎక్కువ రాబడి
ధర్పల్లి/ బిచ్కుంద, డిసెంబర్ 21: ఉపాయం ఉండాలే గాని ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు.. అన్న చందంగా ప్రస్తుత పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఉల్లినారుతో ఉపాధి పొందుతున్నారు ఉమ్మడి జిల్లాలోని పలువురు రైతులు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని చేతులెత్తేసిన నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటలను సాగు చేసేలా అవగాహన కల్పిస్తున్నది. వాణిజ్య, ఆరుతడి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కొందరు రైతులు ఉల్లితోపాటు టమాట, మిరప, వంకాయ, కాలీఫ్లవర్ తదితర పంటల నారును పెంచి విక్రయిస్తూ మెరుగైన ఉపాధి పొందుతున్నారు.
కోతలు పూర్తికాగానే ఉల్లిపై దృష్టి..
వానకాలం పంట కోత పూర్తికాగానే పలువురు రైతులు ఉల్లినారు సాగుపై దృష్టి సారించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉల్లి విత్తనాలు వేశారు. కిలో ఉల్లి విత్తనాలకు రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు వరకు వెచ్చించారు. సాగు చేసిన ఉల్లినారు 45 రోజులకు నాటేందుకు సిద్ధమవుతుంది. అక్టోబర్ చివరివారం నుంచి డిసెంబర్ వరకు ఉల్లినారుకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో రైతులు ఉల్లినారును పీకి కట్టలు కట్టి విక్రయిస్తుంటారు.
అంగడిలో విక్రయాలు..
నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి, డిచ్పల్లి, నందిపేట, నవీపేట, ఆర్మూర్ మండలాలతోపాటు కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్, బిచ్కుంద, నిజాంసాగర్ తదితర మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉల్లినారును సాగు చేశారు. ప్రస్తుతం వివిధ గ్రామాల పరిధిలో జరిగే వారాంతపు సంత(అంగడి)లో ఉల్లినారు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వెయ్యి రూపాయల పెట్టుబడితో సాగు చేసిన ఉల్లినారుతో రైతులు పదివేలకు పైగా సంపాదిస్తున్నారు.
ఒక్కరోజులో 30వేల వరకు సంపాదించా..
ఉల్లి, టమాట, మిరప తదితర నారును విక్రయించి ఒక్క రోజులో 30వేల వరకు సంపాదించాను. కామారెడ్డిలో పెద్ద ఎత్తున నారు అమ్మేవాడిని. డిచ్పల్లిలో సైతం కొంతకాలం నారు విక్రయించాను. ధర్పల్లిలో మూడు అంగళ్ల నుంచి నారు విక్రయిస్తున్నాను. నాలుగైదు సంచుల్లో తీసుకువస్తున్న నారు మొత్తం ఇట్టే అమ్ముడుపోతుంది. చాలా సంతోషంగా ఉంది.
-మాచబోయిన శ్రీనివాస్, రైతు