బోధన్, నవంబర్ 21 : కమ్మ కులస్తులు సమాజంలో మంచిని పెంచుతూ అన్ని రంగాల్లో రాణించాలని, తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. బోధన్ పట్టణ శివారులోని కమ్మసంఘం ప్రాంగణంలో బోధన్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో ‘కమ్మవారి కార్తీకమాసం ఆత్మీయ సమ్మేళనం – వన భోజనాలు’ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ గాంధీతో పాటు సిర్పూర్-కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ మంత్రి మండవ వేంకటేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఎం.అమర్‌నాథ్‌బాబు జ్యోతి ప్రజల్వన చేశారు. అంతకుముందు స్వర్గీయ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోధన్ కమ్మ సంఘం కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడిందని అరికెపూడి గాంధీ అన్నారు. మాదాపూర్‌లో కమ్మ సంఘం భవనానికి సీఎం కేసీఆర్ ఐదు ఎకరాల భూమిని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థులను చదివించేందుకు కమ్మ సంఘం ఆధ్వర్యంలో ట్రస్టును ఏర్పాటుచేయడం అభినందనీయమని సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాజకీయాలే సర్వస్వంగా కుల సంఘాలు పనిచేయడం సరికాదన్నారు. తన సూచన మేరకు బోధన్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో విద్యా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బోధన్ కమ్మ సంఘం అధ్యక్షుడు పల్లెంపాటి శివన్నారాయణ, ప్రధాన కార్యదర్శి దావులూరి హరినాథ్‌బాబు, కోశాధికారి పల్లెంపాటి శ్రీధర్, కమ్మ సంఘం నాయకుడు పీవీ సుబ్బారావు, సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల సుబ్బారావు, సమ్మేళనం కార్యక్రమ అధ్యక్షుడు పావులూరి వెంకటేశ్వర్రావు, సమన్వయ కర్త పి.గాంధీ, ప్రతినిధులు ఈవీ రంగారావు, ఎలవర్తి రవీంద్రబాబు, వి.రవి తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో సేవలను అందిస్తున్న పలువురిని కమ్మ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు.