సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటన
జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తిన సంబురాలు
వడ్ల కొనుగోలుపైనా కేంద్రం దిగిరావాలంటున్న రైతులు
నిజామాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చలికి వణుకుతూ.. వానకు తడుస్తూ.. తుపాకులు ఎక్కుపెట్టినా బెదరలేదు.. పలువురు రైతులు ప్రాణత్యాగం చేశారు…చివరికి అనుకున్నది సాధించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా సాగిన ఉద్యమం ఫలించింది. వెల్లువెత్తిన నిరసనోద్యమానికి కేంద్రం మోకరిల్లింది. సాక్షాత్తు ప్రధాని మోదీ కొత్తగా తెచ్చిన చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించడంతో అన్నదాతల్లో విజయోత్సాహం పెల్లుబికింది. ఉమ్మడిజిల్లా అంతటా రైతులు సంబురాలు జరుపుకొన్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. పలుచోట్ల టీఆర్ఎస్, వామపక్షాలు, రైతుసంఘాలు సంబురాల్లో భాగమయ్యాయి. రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే వారెవరైనా వెనక్కి తగ్గాల్సిందేనని అన్నదాతలు ముక్తకంఠంతో నినదించారు. కేంద్రం దిగివచ్చి, తెలంగాణ వడ్లను కొనాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు వెల్లువెత్తాయి. పలుచోట్ల రైతులు పటాకులు కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు. వ్యవసాయ రంగంలో దళారుల వ్యవస్థ వేళ్లానుకునేలా, రైతులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోయి కార్పొరేట్ శక్తులు లాభపడేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన మొదలైంది. రైతుచట్టాలపై అభ్యంతరాలను పట్టించుకోని కేంద్రం మొండిగా ప్రవర్తిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను కాల్చి చంపింది. కేంద్ర సర్కారు అవలంబించిన నిరంకుశ విధానాలను ఎండగడుతూనే పంజాబ్, హర్యానా రైతులు ధైర్యంగా ధర్నాను కొనసాగించి ఎట్టకేలకు విజయం సాధించారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతర కాలంలో సాక్షాత్తు ఓ ప్రధానమంత్రితో బేషరతు క్షమాపణలు చెప్పించేలా రైతులు ఉద్యమించడం అసాధారణమైనది.
రైతు విజయం…
కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిగా పట్టువదలకుండా పోరాటం కొనసాగించారు. పంజాబ్, హర్యా నా రాష్ర్టాల రైతులు ఉద్యమించారు. మొదట స్థానికంగా నిరసనలు సాగి..క్రమంగా ఢిల్లీకి మకాం మారింది. సుమారు 35 రైతు సంఘాల నేతృత్వంలో వేలాది మంది రైతులు ఢిల్లీలో నిరాటంకంగా పోరాటం నిర్వహించారు. రైతు ఉద్యమాన్ని అణచి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. రైతులపై తుపాకులు ఎక్కుపెట్టినా ఉత్తరాది రైతులు అదరలేదు, బెదరలేదు.
మోసకారి బీజేపీ…
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుఓద్ధరణ జరిగి నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. రైతుబంధు పేర పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. రైతుబీమాతో రైతుల కుటుంబాలకు భరోసా ఏర్పడింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల నిరంతర విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలు వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం ద్వంద్వ విధానాలతో రైతు పండించిన ధాన్యం కొనబోమంటూ మొండి చేయి చూపుతున్నది. కేంద్రం వైఖరి ముందే గ్రహించి రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో వరి పంట బదులుగా యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయండని తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజులుగా రైతులకు విజ్ఞప్తి చేసింది. నాడు ఉద్యమంలోనైనా, నేడు స్వరాష్ట్రంలోనైనా టీఆర్ఎస్కు రైతుల ప్రయోజనాలే ముఖ్యం. అన్నదాతల ఆకలి తీర్చేందుకు పోరాటం చేయడం టీఆర్ఎస్కు కొత్తేమీ కాదు. దేశ ప్రగతిలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. రైతును రాజు చేసిన కేసీఆర్ కండ్ల ముందు రైతులు ఆగం అవుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోలేడన్న సమాచారం టీఆర్ఎస్ ఆందోళనలతో కేంద్రానికి తెలిసింది.
సీఎం కేసీఆర్ కృషితోనే నల్లచట్టాలు రద్దు..
సీఎం కేసీఆర్ ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మహాధర్నాతో కేంద్రం దిగివచ్చి వ్యవసాయచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది కేసీఆర్ సాధించిన విజయం. పంజాబ్, హర్యానా రైతులు సంవత్సరం నుంచి నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ధర్నా చేశారు. సీఎం కేసీఆర్ సైతం రైతులకోసం ఉద్యమం చేసేందుకు కలిసి రావాలని ఇతర రాష్ట్రాలకు పిలుపునివ్వడంతో కేంద్రం వెంటనే దిగివచ్చి నల్లచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో కేసీఆర్ అధ్యక్షతన మరో కూటమి ఏర్పడే అవకాశం ఉందని గ్రహించి ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలోని రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అనుకుంటే ఏదైనా సాధిస్తారని మరోమారు రుజువు చేశారు.
-గంగారెడ్డి, చెరుకు అభివృద్ధి సంఘం అధ్యక్షుడు, కోమలంచ
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న తల్లి తెలంగాణ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు అలుపెరగకుండా చేసిన పోరాట ఫలితమే నల్లచట్టాల రద్దు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ నాయకుల ధర్నా, రైతు మద్దతు ఉద్యమాలతో నల్లచట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటించారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కె ముజీబుద్దీన్, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కృష్ణమోహన్ ఆనంద్, రామ్‌కుమార్ గౌడ్, భూమేశ్ యాదవ్, చట్ల రాజేశ్వర్, అంజాద్, రామ్మోహన్, సలీం, హరి, జమీల్, వంశీ, భాను, మాజిద్, బండారి, రామ్‌రెడ్డి మన్నూర్ తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డిలో..
కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతుల విజయమని రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాయన్న అన్నారు. మాచారెడ్డి మండలంలోని భవానీపేట గ్రామంలో రైతులతో కలిసి శుక్రవారం సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులు చేస్తున్న పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. రైతులు పండించే ధాన్యం పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే కొనాలని, దానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల వెంకటయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాల్, జిల్లా అధ్యక్షుడు భూపాల్, లచ్చన్న, రైతులు పాల్గొన్నారు.
రైతు మహాధర్నాతోనే కేంద్రం దిగొచ్చింది..
సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు మహాధర్నాతోనే పీఎం నరేంద్రమోదీ దిగొచ్చారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి రైతులను మోసం చేయాలని చూసింది. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి, నల్లచట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని ప్రకటించడం సీఎం కేసీఆర్ ఘన విజయం. రైతులకు వ్యతిరేకం గా బీజేపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సీఎం కేసీఆర్ ఇలాగే స్పందించి రైతులకు న్యాయం చేస్తారు. – పోచారం భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్