ఉద్యానపంటల వైపు రైతు చూపు
డ్రాగన్ ఫ్రూట్ సాగుపై దృష్టి
ఒక్కసారి పెట్టుబడి.. 20 ఏండ్ల పాటు రాబడి
ఇందల్వాయి, నవంబర్ 16 : ఉద్యాన పంటల్లో డ్రాగన్ ఫ్రూట్‌కు డిమాండ్ ఉండడంతో రైతులు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎలా తట్టుకోవాలో తెలుసుకుని ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి కి చెందిన తాడెం గంగారాం యూట్యూబ్‌లో పంట సాగు విధానం తెలుసుకుని అర ఎకరంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆయన.. విశ్రాంత వ్యవసాయాధికారి సూచనతో సాగు విధివిధానాలను అధ్యయనం చేశాడు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతులను కలిసి మెళకువలు నేర్చుకున్నాడు. ఇందుకు అవసరమైన సిమెంట్ దిమ్మెలను సొంతంగా తయారు చేశాడు. రూ.100 చొ ప్పున 400 మొక్కలను హర్యానా నుంచి తెప్పించి సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నాడు.
సాగు విధానం
మొక్కలకు ఆధారం కోసం 10 అడుగుల దూరం తో 100 స్తంభాలు పాతారు. నాలుగు వైపులా సిమెంట్ స్తంభాలు సొంతంగా తయారు చేసుకోవడంతో రూ.2లక్షల వరకు ఆదా అయ్యింది. మొక్కలు నాటి ఏడాది అయ్యింది. మరో ఆరు నెలల్లో దిగుబడి చేతికి రానున్నది. ఒక్కసారి నాటితే 20 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. నీరు నిలవని నేలలు ఎంచుకొని ఎకరానికి 2 వేల వరకు మొక్కలు నాటుకోవచ్చు.
పసుపులో అంతరపంటగా స్వీట్‌కార్న్….
చాలామంది రైతులు పసుపులో అంతర పంటగా మక్కజొన్న, మిరప, కంది వేసి అదనపు ఆదా యం ఆర్జింస్తుంటారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. స్వీట్‌కార్న్ వేసి సాధారణ మక్కజొన్న కన్నా అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. మక్కతో పోలిస్తే ఈ పంటకు శ్రమ, పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండి, ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎకరం పసుపు తోటలో స్వీట్ కార్న్ వేస్తే ఖర్చులు పోను రూ.21,500 మిగులు ఆదాయం వస్తున్నది. సాధారణ మక్క 120 రోజుల్లో రాగా, స్వీట్‌కార్న్ పంట కేవలం 75 రోజుల్లో చేతికొస్తున్నది. దీన్ని గమనించి ప్రస్తుతం రైతులు వరిసాగును తగ్గించి ఆరుతడి పంటలపై దృష్టిసారిస్తే అధిక లాభం వస్తుంది.