పేదలందరికీ సంక్షేమ పథకాలు
ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ‘డబుల్ ఇండ్ల’ నిర్మాణం
బాన్సువాడ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో స్పీకర్ పోచారం
బీర్కూర్, అక్టోబర్ 18 : సమైక్య పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండలంలోని నాగారంలో 20, కొల్లూర్‌లో పది డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. కొల్లూర్‌లో 20 ఇండ్లు మంజూరుకాగా, రెండు ఇండ్లకు భూమిపూజ చేశారు. కమ్యూనిటీ భవనాలను ప్రారంభించి, మరికొన్నింటికి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా కొల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని కేవలం ఏడేండ్లు అయ్యిందని, ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. సమైక్యపాలనలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు పథకాలు లేవన్నారు. నిజాంసాగర్ ఎగువప్రాంతంలో ఎన్నో ప్రాజెక్టులు కడితే ఎండిపోతున్న తరుణంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం ద్వారా నీరందించేందుకు ఎవరైనా కృషి చేశారా అని ప్రశ్నించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి, ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటే అది తెలంగాణ ప్రభుత్వమన్నారు. గొల్ల, కుర్మలకు గొర్రెలు, మత్స్యకారులకు సబ్సిడీపై చేప పిల్లలను ఇస్తున్నట్లు తెలిపారు. వృద్ధులకు ఆసరా కింద రూ.2016, దివ్యాంగులకు రూ. 3016 పింఛన్ ఇస్తున్నామన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా ఇవ్వడం లేదన్నారు. ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే డబుల్ బెడ్ రూం ఇండ్లు, మిషన్ భగీరథ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 7.30 లక్షల కుటుంబాలు ఉన్న గొల్ల, కుర్మలకు గొర్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రూ.95 వేల రాయితీతో ఒక్కో యూనిట్‌కు రూ.లక్షా 20 వేల చొప్పున మొదటి విడుతలో 3 లక్షల 81 వేల కుటుంబాలకు అందించగా, రెండో విడుతలో మిగిలిన కుటుంబాలకు త్వరలో అందించనున్నట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఐదు వేల ఇండ్లను పూర్తి చేశామని, ఇంకా ఐదు వేల ఇండ్లను నిర్మిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాల హయాం లో ఇంటి నిర్మాణానికి రూ.70 వేలు ఇస్తే పేదల పేరు చెప్పి ధనికులే ఇండ్లను నిర్మించుకొన్నారని ఆరోపించారు. అంతకు ముందు బాన్సువాడలో హనుమాన్ వ్యాయామ శాల వద్ద రూ.కోటీ 10 లక్షలతో నిర్మించిన దుకాణా సముదాయాలు, ఫంక్షన్ హాలును స్పీకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కొల్లూర్, నాగారం గ్రామాల సర్పంచులు తుకారాం, రాచప్ప, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.