రెంజల్, డిసెంబర్ 7: పండే పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి. కడుపునిండా తిండిపెట్టాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా నిలవాలి. అలాంటి మద్దతు పొగాకు సాగుతో దొరుకుతున్నదని అంటున్నారు రెంజల్, బిచ్కుంద రైతులు. తెలంగాణ- మహారాష్ట్ర ప్రాంతాల్లో అధికంగా నల్లరేగడి భూమికి అనుకూలమైన పొగాకు పంట సాగుకు రైతన్నలు అసక్తి చూపుతున్నారు. గత ఏడాది 7,500 ఎకరాల్లో పొగాకు సాగు చేయగా, ఈ ఏడాది 11వేల ఎకరాల మేరకు పొగాకు పంటను పండిస్తున్నారు. తెలంగాణ – మహారాష్ట్రలో కలిపి సుమారుగా 11వేల టన్నుల పొగాకు కొనుగోలు చేసేందుకు ఆయా కంపెనీలు లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. పొగాకు పంటను సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు వీఎస్టీ, ఐటీసీ, పీటీసీ కంపెనీలు బాండ్ల రూపంలో అందించి ఒప్పందం చేసుకుంటున్నాయి. పొగాకు పంట విక్రయానికి వచ్చే అవకాశం ఉండడంతో రైతులు పండించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎకరానికి 10-12 క్వింటాళ్ల పొగాకు పంట సాగు చేయగా, ఎకరానికి రూ. 50, 60వేలు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. గత ఏడాది ఆయా కంపెనీలు రైతులు పండించిన పొగాకు క్వింటాలకు రూ. 10.500 మద్దతు ధరతో కొనుగోలు చేసింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి, నీలా, పేపర్మిల్, బోర్గాం గ్రామాల్లో 3వేల ఎకరాలు, బోధన్ మండలంలోని కొప్పర్గా, హంగర్గా, సిద్ధాపూర్, ఖండ్గాం, కల్దుర్కి గ్రామాల్లో 2500 ఎకరాలు, బిచ్కుంద మండలం హస్గుల్, ఎన్బోరా, నేక్కా గ్రామాల్లో 600 వందల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మహారాష్ట్రలోని బిలోలి, ధర్మాబాద్, కొండల్వాడి, నర్సి, ఉమ్రి పరిధిలోని 25గ్రామాల్లో సుమారు 5వేల ఎకరాల మేరకు రైతులు పొగాకును సాగు చేస్తున్నారు. పొగాకు సాగు చేసిన రైతులు ప్రతి ఏడాది మార్చి మాసంలో కంపెనీలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ప్రకటించిన మద్దతు ధర ద్వారా రైతులు విక్రయిస్తారు.