అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఆ ఇద్దరు కీలక వ్యక్తులు
ఆమ్యామ్యాలకు పాల్పడుతూ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న వైనం
నియామకాలు చేపట్టవద్దని ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు
46 నుంచి 130కి చేరిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల అక్రమ నియామకాలు
నిజామాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీలో అక్రమంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్నది. చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారాన్ని ఉన్నత విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో అనుమతి లేకుండా ఏ ఒక్క పోస్టును భర్తీ చేయవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా టీయూలో నియామకాలు ఆగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. 46గా ఉన్న అక్రమ నియామకాల సంఖ్య ప్రస్తుతం 130కు చేరడం గమనార్హం. మరోవైపు యూనివర్సిటీలో ప్రమోషన్లు ఇప్పిస్తామంటూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.4లక్షల వరకు చెల్లించాలని డిమాండ్ చేసినట్లుగా బాధితులు చెబుతున్నారు. మొత్తానికి కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల వ్యవహారంతో యూనివర్సిటీ అప్రతిష్ట పాలవుతున్నది.
నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా మారింది తెలంగాణ యూనివర్సిటీలోని ఆ ఇద్దరి వ్యక్తుల తీరు. ఇంటా బయటా పెద్ద ఎత్తు న విమర్శలు గుప్పుమంటున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 45 రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ వ్యవహారానికి తెరదించక పోవడం మరింత వివాదాస్పదం అవుతున్నది. ఆమ్యామ్యాలకు రుచి మరిగిన కొంత మంది అక్రమార్కులు తమ పంథా ను మార్చుకోవడం లేదు. ఇటు ప్రభుత్వానికి, అటు యూనివర్సిటీ ప్రతిష్టను తమ స్వార్థం కోసం బలి చేస్తుండడం విడ్డూరంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న నియామకాల తీరుపై సాక్షాత్తు ఉన్నత విద్యా శాఖ తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ఒక్క పోస్టు భర్తీ చేయకూడదంటూ జీవోను జారీ చేసింది. టీయూ వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలపై నియామకాలను నిలుపుదల చేసినప్పటికీ ఆ ఇద్దరి ఆగడాలు మాత్రం ఆగకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎడాపెడా నియామకాలు చేపడుతుండడంతో వివాదం మరింతగా ముదిరింది.
46 నుంచి 130 మందికి…
సెప్టెంబర్ మొదటి వారం నుంచి టీయూలో ఇష్టారీతిన ఆయా పోస్టులను భర్తీ చేశారు. నోటిఫికేషన్లు లేకుండా కేవలం మాట శాసనంగా అక్రమ నియామకాలు చకచకా జరిగాయి. సెప్టెంబర్ 22వ తారీ ఖు వరకు దాదాపు 46 మందికి జాబులు ఇచ్చా రు. ఎలాంటి విద్యార్హతలను ప్రాతిపదికన తీసుకోకుండా కేవలం మామూళ్లు అందించిన వ్యక్తులను ఇష్టారీతిన నియమించేశారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలి వానలా మారింది. ఓ వైపు టీయూ అధ్యాపక బృందం, పలు విద్యార్థి సంఘాలు, టీయూ పాలక మండలి సభ్యులు అంతా కలిసి ప్ర భుత్వానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు చేశారు. టీయూ తతంగాన్ని పరిశీలించిన ఉన్నత విద్యా శాఖాధికారులు ముక్కున వేలేసుకున్నారు. ప్రభు త్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి ఆ ఇద్దరి అడ్డగోలు వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 24న ఉన్నత విద్యా శాఖ నుంచి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వం చెప్పే వరకు, ప్రభుత్వం ఆదేశించేంత వరకు, ప్రభుత్వం అనుమతి లేకుండా అవుట్ సో ర్సింగ్, కాంట్రాక్ట్ వంటి పోస్టులను భర్తీ చేయవద్దని జీవోలో పేర్కొన్నారు. ఇవేవీ పట్టించుకోని ఆ ఇద్దరు అక్రమార్కులు ఎలాంటి జంకు లేకుండా రెట్టింపు సంఖ్యలో నియామకాలు చేపట్టడం దుమారం రేపుతోంది. 46 మందిగా ఉన్నటువంటి అక్రమ నియామకాల సంఖ్య 130 వరకు చేరడంతో అంతా అవాక్కు అవుతున్నారు.
మరో డీల్ సిద్ధం…
విశ్వవిద్యాలయం అంటే పరిశోధనలు, అత్యుత్తమ విద్యాబోధనతో వెలుగు పూలు అందివ్వాలి. విద్యా సంవత్సరంలో కొంగొత్త కార్యక్రమాలతో సమాజ హితం కోసం పని చేయాలి. కరోనా వంటి కష్ట కా లంలో ప్రజలకు ఉపయోగపడే అంశాలపై అవగాహన కల్పించాలి. ప్రధానమైన ఉద్దేశాలను పక్కకు తోసేసి కొంత మంది అక్రమార్కులు ఏకంగా యూనివర్సిటీ అంటే అడ్డగోలుగా జేబులు నింపుకునే వస్తువుగా మార్చుకుంటున్నారు. యూనివర్సిటీ పరిధి పెంపుతో ఖాళీలను బూచీగా చూపించి అక్రమంగా అవుట్ సోర్సింగ్ పోస్టులు నియమించడం తప్పుగా తేలింది. అంతలోనే కీలకమైన వ్య క్తులు ఇద్దరు మరో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. యూనివర్సిటీలో ప్రమోషన్ల అంశాన్ని కొలిక్కి తీసుకు వచ్చి న్యాయం చేస్తామం టూ కొంత మందికి ఆఫర్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది.
ఇందులో ప్రమోషన్ లిస్టులో ఉన్న ఒక్కో వ్యక్తి నుంచి రూ.4లక్షల వరకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేసినట్లుగా బాధితులు చెబుతున్నారు. అక్రమ నియామకాల వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టగానే ప్రమోషన్ల అంశంతో లాభం పొందాలని కీలకమైన వ్యక్తులు ఎత్తుగడలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి యూనివర్సిటీలో కొత్తగా కీలకమైన పదవుల్లో చేరిన వ్యక్తుల మూ లంగా యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతున్నది.
గ్రూపులుగా విడగొట్టి…
టీయూ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ప్రచ్ఛ న్న యుద్ధం తారాస్థాయిలో జరుగుతోంది. యూనివర్సిటీ బాగును పక్కన వదిలేసి గ్రూపులుగా మారి యూనివర్సిటీ ప్రతిష్టను కొంత మంది దెబ్బతీస్తున్నారు. తాజాగా యూనివర్సిటీలో అన్నీ తామై వ్య వహరిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులే తమ అక్రమాలకు ఎవరూ అడ్డు చెప్పకూడదని కొన్ని సంఘాలను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. కొంత మం దికి రెండు నుంచి మూడేసి పోస్టులను భర్తీ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఇష్టారీతిన ఔట్ సోర్సింగ్ పోస్టులను ఆఫర్‌గా చూపించడంతో కొం తమంది వారి పంచన చేరిపోయారు. మరికొంత మంది ఆ ఇద్దరి అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన లు చేశారు. నిలదీతలు, ధర్నాలు తారా స్థాయికి చేరడంతో తప్పుల నుంచి బయట పడేందుకు అక్రమార్కులు ఇద్దరు తమకు అనుకూలంగా ధర్నాలు చేయించుకున్నా రు. ఏ పాపం తెలియని యువకులను వాడుకుని యూనివర్సిటీలో ఆందోళనలు చేయించారు. తెలివిగా అవుట్ సోర్సింగ్ అక్రమాల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు హడావుడి చేశారు. ఈ వ్యవహారంతో కోపోద్రిక్తులైన కొంత మంది రీసెర్చ్ స్కాలర్లు మరుగున పడిన మరో వివాదాన్ని తెర మీదికి తెచ్చారు. ఎనిమిదేండ్ల క్రితం నియామకమైన 55 మంది అధ్యాపకుల వ్యవహారంపై విచారణ చేయించి తొలగించాలంటూ వీసీకి వినతులు సమర్పించారు. మాజీ రిజిస్ట్రార్లు భాస్కర్‌రావు, ప్రసాద్‌రావు కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారం గా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యమం చేపట్టడం ద్వారా టీయూ లో వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
పాలక మండలి సభ్యుల ఆవేదన
తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితితో పాలక మండలి సభ్యులు తీవ్రంగా నొచ్చుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇ ష్టారీతిన జరుగుతున్న తంతును చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నుంచి వచ్చి న ఫిర్యాదులఆధారంగా ఈసీ మెంబర్లు నేరుగా వీ సీ, రిజిస్ట్రార్లకు ఫోన్లు చేస్తే స్పందన రావడం లేద ని, కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని తెలుస్తోం ది. ఈసీ మెంబర్లను వీసీ, రిజిస్ట్రార్లు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న వివాదాస్పద పరిస్థితుల్లో ఈసీ మెంబర్ గా ఉండడం కంటే బాధ్యతల నుంచి తప్పుకోవ డం మేలు అనే కోణంగా ఒకరిద్దరు ఆలోచిస్తున్న ట్లు సమాచారం. తమ పరిపాలన కాలంలో టీ యూలో ఎవరో చేస్తోన్న అక్రమాలకు బాధ్యులుగా నిలవడం ఎందుకు? అనే ప్రశ్న వారిలో వ్యక్తం అ వుతోంది. ఈ అక్రమ నియామకాల వ్యవహారంతో తమ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసుకోవడం మంచి ది కాదనే ఆలోచనతో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.