ముందస్తుగానే అందివచ్చిన వానకాలం
జోరు వానలతో కళకళలాడుతున్న చారిత్రక ప్రాజెక్టు
సింగూర్ ప్రాజెక్టుకు భారీగా వస్తున్న వరద
ఒక వరద గేటు ద్వారా ‘సాగర్’లోకి నీటి విడుదల
ఆయకట్టు రైతుల్లో ఆనందం
నిజామాబాద్, సెప్టెంబర్ 6, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతోంది. జలకళ సంతరించుకొని ఆయకట్టు రైతుల్లో ఆనందం నింపుతున్నది. కొన్నేండ్లుగా కనిష్ఠ నీటినిల్వతో ఉన్న ప్రాజెక్టు.. గతేడాది వానకాలంలో నిండుకుండలా మారగా, గేట్లు ఎత్తి దిగువన ఉన్న మంజీరాలోకి నీటిని వదిలారు. కాళేశ్వరం జలాల రాకతో ప్రాజెక్టుకు పునర్వైభవం దక్కింది. దీనికితోడు భారీ వానలతో ఈ సీజన్లో నిజాంసాగర్ రిజర్వాయర్ జలకాంతులను సంతరించుకుంది. పొరుగున మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 11వ వరద గేటు ద్వారా నీటిని నిజాంసాగర్‌లోకి సోమవారం విడుదల చేశారు. మరికొద్ది గంటల్లో నిజాంసాగర్ వరదగేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆగస్టు నెలాఖరుకే నిజాంసాగర్ ప్రాజెక్టులో సగానికిపైగా నీరు వచ్చిచేరింది. మొత్తం 1,405 అడుగుల నీటిమట్టానికి ప్రస్తుతం 1402.01 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. వరుసగా రెండో సంవత్సరం నిజాంసాగర్‌కు కాలం కలిసి రావడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
వరద ప్రవాహం లేక కనిష్ట నీటి నిల్వతో కొట్టుమిట్టాడే నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఆశాజనక పరిస్థితులు ఏర్పడ్డాయి. గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా ఆశాజనకమైన ఫలితాలను చారిత్రక ప్రాజెక్టు అందివ్వనున్నది. గతేడాది వానకాలంలో నిండుకుండలా మారి గేట్లు ఎత్తి దిగువకు మంజీరలోకి నీటిని వదిలారు. ఈ సీజన్లోనూ గతేడాది మాదిరిగానే జల కాంతులు సంతరించుకోవడంతో త్వరలోనే వరద గేట్లు తెరుచుకునే అవకాశం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వానలతో సింగూర్ నిండుకుండను తలపిస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో సింగూర్ ప్రాజెక్టు ఒక వరద గేటును సోమవారం అధికారులు ఎత్తివేసి నీటి విడుదల చేపట్టారు. దీం తో నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల కొనసాగుతున్నది. ఆగస్టు నెలాఖరుకే నిజాంసాగర్ ప్రాజెక్టు సగానికి ఎక్కువ నీటి మట్టంతో తొణికిసలాడుతోంది. 1405 అడుగుల నీటి మట్టానికి ప్రస్తుతం 1402.01 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. వరుసగా రెండో సంవత్సరం నిజాంసాగర్‌కు కాలం కలిసి రావడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
గడ్డు కాలానికి స్వస్తి
2019లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు నిండుకుండలను తలపించగా కేవలం సింగూర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు మాత్రమే కళావిహీనంగా కనిపించాయి. ఎగువ నుంచి వరద లేకపోవడంతో చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టు చాలా ఏండ్లుగా వెలవెలబోయింది. వరద రాక నిలిచిపోవడంతో నిజాంసాగర్ ఆయకట్టు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వానకాలం, యాసంగి పంటల సాగుకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో సాగుకు నీళ్లు సర్దుబాటు చేసేవారు. అందుబాటులో ఉన్న స్వల్ప నీటినే ఆన్ అండ్ ఆన్ పద్ధతిలో నీటిని వినియోగించుకుంటూ పంటలకు ప్రాణం పోసేలా చర్యలు తీసుకునేవారు. 2016లో చివరి సారిగా నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి దిగువకు మంజీరా నదిలోకి నీళ్లను వదిలిపెట్టారు. ఆ తర్వాత ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి రావడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. 2020లో కాలం కలిసి రావడంతో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తిరిగి 2021లోనూ భారీ వానలు అందుకోవడంతో గడ్డుకాలం కాస్తా తొలిగిపోయినట్లయ్యింది. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా ప్రాజెక్టులో 14 టీఎంసీలు మేర నీటి నిల్వ ఉంది. మరో మూడున్నర టీఎంసీలు వరద వస్తే గేట్లు ఎత్తి మంజీరలోకి వరదను పంపించనున్నారు.
సింగూర్‌కు జలకళ…
ఎగువన పొరుగు రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటున్నది. 29.99 టీఎంసీలు పూర్తి స్థాయి సామర్థ్యం ఉన్న సింగూర్‌లో 26.706 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. వరద ప్రవాహం భారీగా కొనసాగడంతో సోమవారం 11వ నంబర్ వరద గేటు ద్వారా 8,626 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూలై నెల ప్రారంభం నాటికి సింగూర్‌లో అరకొరగానే నీటి నిల్వలు ఉండగా క్రమంగా భారీ వర్షాలతో పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువైంది. చాలా రోజుల తర్వాత సింగూర్ ప్రాజెక్టు జలకళతో సంతరించుకున్నది. మంజీరా నదిపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్న నేపథ్యంలో దిగువన కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు సైతం సంబురం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే యాసంగి పంటలకు ఢోకా ఉండబోదని సంతోషంతో ఉన్నారు. సింగూర్‌కు వరద పెరుగుతుండడంతో జల వనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ వరద పరిస్థితులను అంచనా వేస్తూ నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
తాగునీటికి చింతలేదిక…
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ అందించే తాగునీటి సరఫరాకు సింగూర్ ప్రాజెక్టు కీలకం. సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు ద్వారా బోధన్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు, జుక్కల్ నియోజకవర్గంలో ఆరు మండలాలు, బాన్సువాడ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలతోపాటు ఎల్లారెడ్డిలోని మూడు మండలాలు మొత్తం 21 మండలాల్లో 819 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. 2020 వేసవికాలం వరకు సింగూర్‌కు జలకళ తప్పడంతో మిషన్ భగీరథకు నీటి కటకట తీవ్రంగా ఎదురైంది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీళ్లతోనే ఏడాదంతా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు మండలాలకు మంచినీళ్లు అందించారు. సింగూర్ రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం 0.314 టీఎంసీలకు తగ్గిపోవడం మూలంగా 2019లో జూన్ 27వ తేదీ నుంచి బల్క్ వాటర్ విడుదల నిలిపేశారు. ఆ తర్వాత వానలు జోరుగా కురవడం సింగూర్‌కు సమృద్ధిగా వరద రావడంతో తాగునీటికి ఇక్కట్లు తీరినట్లయ్యింది. 2020 ఆగస్టు 26వ తేదీ నుంచి బల్క్ వాటర్ విడుదల ప్రారంభమవ్వగా నిరాటంకంగా తాగునీటి సరఫరా కొనసాగుతున్నది.