యంత్రాలతో ప్రసాదం తయారీ
రూ.13.8 కోట్లతో అధునాతన యంత్రాలు
యాదాద్రి, సెప్టెంబర్ 6 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొత్త ఆలయం త్వరలో ప్రారంభం కానున్నది. అందుకనుగుణంగా పనులు జరుగుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులందరికీ స్వామివారి ప్రసాదం అందివ్వాలన్న సంకల్పంతో వైటీడీఏ చర్యలు తీసుకుంటున్నది. భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున రోజుకు సుమారు లక్ష లడ్డూలను అందుబాటులో ఉంచనున్నది. ఇందుకోసం రూ.13.8 కోట్లతో అధునాతన భారీ యంత్రాలను కొనుగోలు చేయగా బిగింపు ప్రక్రియ తుది దశకు చేరింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రసాదాల తయారీ, విక్రయశాల ఒకేచోట ఉండేలా నాలుగంతస్తుల భవనం నిర్మించారు. ఈ భవనం ప్రధానాలయంలోని శివాలయం వెనుక ఉంది. హరేకృష్ణ మూమెంట్ హైదరాబాద్ వారు ఈ లడ్డూల తయారీకి సంబంధించిన బాధ్యతలు చేపట్టారు.
తిరుపతి తరహాలో..
తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ తర్వాత యాదగిరిగుట్ట లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఆదరిస్తారు. సీఎం కేసీఆర్ సూచనలతో తిరుమల తరహాలో ప్రసాదాలు సిద్ధం చేసేందుకు అధునాతన యంత్రాలను కొనుగోలు చేశారు. ఈ యంత్రాలను చెన్నై, పుణే, హర్యానా, ముంబాయి, రాజమండ్రి నుంచి తెప్పించారు. యంత్రాలు బిగించేందుకు నిపుణులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. బూందీ ప్రైయర్, సుగర్ సీరప్ మిషన్, దాల్ పుల్వరైజర్, గ్రైండింగ్ మిషన్, చక్కెర సైలోస్ మిషన్ తదితర యంత్రాల బిగింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చింది. వినియోగించే సరుకులను యంత్రాల చెంతకు చేర్చితే ప్రసాదాలను అవసరాలకు అనుగుణంగా యంత్రాలే సిద్ధం చేస్తాయని హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు తెలిపారు. సిద్ధమైన ప్రసాదాలను కన్వేయర్ బెల్టుల ద్వారా విక్రయ కౌంటర్ల చెంతకు చేరవేయనున్నారు. ఇందుకోసం కన్వేయర్ బెల్టులు, విక్రయశాల కౌంటర్లతోపాటు సరుకులను యంత్రాల వద్దకు చేరవేసే బెల్టును ఏర్పాటు చేశారు. లడ్డూలను నిల్వ చేసే ట్రేలు అందుబాటులో ఉంచారు. ట్రేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు వీలుగా యంత్రాలను అమర్చారు. యంత్రాలు పనిచేసేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
బూందీ తయారీ ఇలా..
స్వామి ఆలయంలో భక్తులకు అందజేసే లడ్డూ, పులిహోర, వడలను మానవ రహిత యంత్రాలతో తయారు చేయనున్నారు. లడ్డూ తయారీలో భాగంగా మొదట బూందీని తయారు చేస్తారు. బూందీ తయారీ మిషన్(బూందీ ఫ్రైయర్స్) ప్రసాద విక్రయ భవనంలోని చివరి అంతస్తులో అమర్చారు. బూందీ గ్రైండింగ్ మిషన్‌లో పప్పును వేస్తారు. ఈ పప్పు మిషన్‌లోకి నెమ్మదిగా వెళ్లి పౌడర్‌గా మారి అక్కడే అమర్చిన బిన్‌లోకి వెళ్లిపోతుంది. ఇలా 50 కేజీల పప్పు పౌడర్‌ను తయారు చేసిన అనంతరం పౌడర్ బూందీ ఫ్రైయర్లోకి వెళ్తుంది. ఈ మిషన్‌లోకి 600 కేజీల బూందీ తయారీకి 400 కేజీల పౌడర్, 30 లీటర్ల నీళ్లను ఆటోమెటిక్‌గా మిషన్ తీసుకుంటుంది. బూందీకి కావాల్సిన నూనె అక్కడే గ్యాస్ బర్నర్‌లో మరుగుతూ ఉంటుంది. మిషన్‌లో ఈ చివరి నుంచి ఆ చివరికి వచ్చే సరికి మరిగిన నూనె కలిసి చక్కటి బూందీ తయారై కింద తొట్లలో పడిపోతుంది.
చక్కెర పాకం..
చక్కెర పాకం మిషన్‌లో స్టిల్కు సంబంధించిన రెండు సిలిండర్లు ఉంటాయి. ఇందులో చక్కెర సైలోస్ మిషన్లు ఉంటాయి. వాటి నుంచి చక్కెర స్టిల్ సిలిండర్లకు వెళ్తుంది. అక్కడే చక్కెర పాకం తయారవుతుంది. బూందీకి ఎంత పాకం, ఆ పాకానికి కావాల్సిన చిక్కదనం ఉండేలా చక్కెర పాకం మిషన్‌కు ముందే అమర్చుతారు. బూందీకి ఎంత పాకం కావాలో పంపు కొడితే అంతే పాకం బూందీలో పడుతుంది. అనంతరం లడ్డూకు కావాల్సిన యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వంటివి మిషన్ ద్వారా వేస్తారు.
లడ్డూ తయారీ ఇలా..
చక్కెర పాకంతో మిక్సయిన బూందీని బూందీ లడ్డూ మిక్సర్‌లో కలుపుతుంది. దీని ద్వారా బూందీ పాడవుకుండా చక్కటి లడ్డూలు తయారు చేసేందుకు వీలవుతుంది. బూందీ లడ్డూ మిక్సర్‌లో 500 కేజీల బూందీ లడ్డూకు 100 గ్రాముల జీడిపప్పు, కిస్మిస్, యాలకులు కలిపి సుమారు 2 నిమిషాల పాటు మిక్స్ చేస్తారు. ఇలా 16 గంటల్లో యాభై వేల నుంచి లక్ష లడ్డూల వరకు తయారు చేసుకోవచ్చు. తయారైన లడ్డూలు కన్వేయర్ బెల్టుల ద్వారా కౌంటర్ వద్దకు తీసుకొచ్చేలా యంత్రాలను అమర్చారు.
నెలలోపు లడ్డూల ట్రయల్ రన్
లడ్డూ తయారీ యంత్రాల బిగింపు పనులు తుది దశకు చేరాయి. ఆలయం ప్రారంభమైన అనంతరం స్వామివారికి భక్తుల తాకిడి పెరుగుతుంది. మానవరహితంగా తయారు చేసే ప్రసాదాలకు స్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తుడికీ అందించేలా చర్యలు చేపడుతున్నాం. నెలలోపు లడ్డూ తయారీ ట్రయల్ రన్ నిర్వహిస్తాం.
-ఎన్.గీత, ఆలయ ఈవో, యాదాద్రి దేవస్థానం