కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా
మైకు చేతికి అందితే ఏదైనా మాట్లాడుతారా..?
తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలోనే లేదు : స్పీకర్ పోచారం
బీర్కూర్, సెప్టెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో తెలియని వారు బాన్సువాడకు వస్తే చూపిస్తానని అన్నారు. కాదని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. మైకు దొరకగానే నరుకుతా.. పొడుస్తా అని అనగానే సరిపోదని, తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉన్నా యా? అని ప్రశ్నించారు. బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో పలు అభివృద్ధి పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. రూ.21లక్షలతో జీపీ భవనం, రూ.10 లక్షలతో ముదిరాజ్ సంఘ భవనం, రూ.12.60 లక్షలతో శ్మశానవాటిక, రూ.50.40 లక్షలతో పది డబుల్ బెడ్రూం ఇండ్లు, రూ.5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించగా స్పీకర్ ప్రారంభించారు. అదేవిధంగా స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.30లక్షలతో నిర్మించనున్న మూడు అదనపు తరగతి గదులు, రూ.10లక్షలతో సొసైటీ నూతన భవనం, రూ.కోటీ 35 లక్షలతో నిర్మించనున్న 35 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. నియోజకవర్గాన్ని అభివృద్ధికి అద్దంపట్టేలా మారుస్తానని, తనకు కావాల్సింది ప్రజల ఆశీర్వాదమేనని అన్నారు. తెలంగాణ రాక ముందు పాలించిన ప్రభుత్వాలు ఇల్లు కట్టుకునేందుకు కేవలం రూ.60వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్న రోజులను ప్రజలు మర్చిపోలేదన్నారు. పెద్ద మనుషులుగా చలామణి అయినవారు 10 ఇండ్లను కూడా కట్టకుండానే బిల్లులను తీసుకొని ‘దొంగలు..దొంగలు ఊర్లు పంచుకున్న’ట్లుగా వ్యవహరించిన విషయం వాస్తవం కాదా..? అని నిలదీశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఒక్కో ఇంటికి రూ.5లక్షల4వేలు ఇస్తున్నారని, ఇలాంటి పథకాన్ని అమలు చేస్తున్నది దేశంలో తెలంగాణ ఒక్కటేనని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 5 వేల ఇండ్లను నిర్మించామని, మరో 5 వేల ఇండ్లను మంజూరు చేశామన్నారు. సరిపోకుంటే ఇంకా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన సర్పంచ్ అల్లం అంబయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ స్వరూప, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఇన్చార్జి సర్పంచ్ విఠల్, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, వైస్ ఎంపీపీ కన్నెగారి కాశీరాం, ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో రాధ, కోఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లాడేగాం వీరేశం, గ్రామ అధ్యక్షుడు మెంగురం మోహన్, నాయకులు ప్రదీప్ పంతులు, వెంకట్‌రెడ్డి, నబీ సాబ్, గౌస్ పటేల్, హైమద్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.