భీమ్‌గల్, ఫిబ్రవరి 19 : భీమ్‌గల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కన్నె ప్రేమలతా సురేందర్ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అధ్యక్షతన ఎన్నిక ప్రక్రియను శనివారం నిర్వహించారు. ఇప్పటివరకు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కొనసాగిన మల్లెల రాజశ్రీ అనారోగ్యంతో తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికను నిర్వహించారు. ప్రేమలత పేరును 9వ వార్డు కౌన్సిలర్ మల్లెల రాజశ్రీ ప్రతిపాదించగా… మున్సిపల్ వైస్‌చైర్మన్ భగత్ బలపర్చారు. 12 వార్డులకు కౌన్సిలర్లు టీఆర్ఎస్కు చెందిన వారు కావడం, అందరూ ఓటు వేయడంతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కన్నె ప్రేమలత గెలిచినట్లు అదనపు కలెక్టర్ ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, జడ్పీటీసీ సభ్యుడు రవి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోయిజ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మానాయక్, కౌన్సిలర్లు లింగయ్య, మూత లత, నర్సయ్య, గంగాధర్, ఖైరున్నీసా బేగం, సతీశ్‌గౌడ్, మల్లెల రాజశ్రీ, తుమ్మ భూదేవి, షమీంబేగం, మల్లెల అనుపమ, కో-ఆప్షన్ సభ్యుడు గాడి శోభ, అజ్మత్, పర్స నవీన్ పాల్గొన్నారు.
మంత్రి వేములను కలిసిన మున్సిపల్ చైర్పర్సన్
భీమ్‌గల్ మున్సిపల్ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన కన్నె ప్రేమలతా సురేందర్.. వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు మంత్రి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న మంత్రి
భీమ్‌గల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన కన్నె ప్రేమలతా సురేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరుకానున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించే కార్యక్రమానికి మంత్రి హాజరు కానున్నట్లు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ తెలిపారు.