ఎంపీ రాక సందర్భంగా రోడ్డెక్కిన కర్షకులు
ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ నిరసన
అర్వింద్ రెచ్చగొట్టే ధోరణితో పరిస్థితులు ఉద్రిక్తం
విగ్రహావిష్కరణ సాకుతో దాడులకు ప్లాన్!
బీజేపీ శ్రేణుల రాళ్లదాడిలో రైతులు, పోలీసులకు తీవ్ర గాయాలు
ధర్పల్లిలో పసుపు రైతులపై రాళ్లదాడి
నిజామాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);బీజేపీ కార్యకర్తలు నిజామాబాద్ జిల్లాలో మరోసారి గూండాగిరీకి దిగారు. పసుపుబోర్డుపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన రైతులపై రెచ్చిపోయారు. రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ రాళ్లదాడిలో పలువురు రైతులు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. శివాజీ విగ్రహావిష్కరణకు బీజేపీ ఎంపీ అర్వింద్ వస్తున్న సందర్భంగా శాంతియుత నిరసనకు రైతులు సిద్ధమయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారవచ్చని తెలిపిన పోలీసులు ఎంపీని రావద్దని వారించారు. ఎంపీ వెనుదిరిగినప్పటికీ.. బీజేపీ కార్యకర్తలను పెద్దసంఖ్యలో ధర్పల్లికి చేరుకునేలా చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. రైతులపై బీజేపీ శ్రేణులు రాళ్లదాడికి పాల్పడగా.. ధర్పల్లి ఎస్సై, సర్పంచ్ సహా పలువురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి.
లోక్‌సభ ఎన్నికల్లో గెలిపిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని మాటిచ్చి తప్పిన ఎంపీ ధర్మపురి అర్వింద్ హామీకి మూడేండ్లు దగ్గర పడ్డాయి. ఆయనిచ్చిన హామీ పట్టాలెక్కకపోవడంతో గంపెడంత ఆశతో ఎదురుచూస్తున్న వాళ్లంతా ఎంపీని అడుగడుగునా నిలదీస్తున్నారు. ఐదు రోజులు కాస్తా వెయ్యి రోజులకు చేరువవుతున్నప్పటికీ బీజేపీ ఎంపీ రోజుకో మాట చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇచ్చిన హామీ ఏదని ప్రశ్నిస్తే రైతులని కూడా చూడకుండా బీజేపీ నాయకులతో దాడులకు ఉసిగొల్పుతున్నారు. మూడు నెలలుగా ఇదే తీరుతో.. ఎంపీ అర్వింద్ వైఖరి స్ప ష్టం చేస్తున్నది. ఇందల్వాయి మండలం గన్నారం, ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి ఘటనలతోపాటు తాజాగా ధర్పల్లిలో పసుపు రైతులపై బీజేపీ నేతల దాడులు చూస్తుంటే ఎంపీ అర్వింద్ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లుగా అర్థం అవుతున్నదని కర్షకులు వాపోతున్నారు. ఇచ్చిన హామీపై మాట్లాడకుండా పసుపు బోర్డు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు దాడులు చేయిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ తీరు మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరిస్తున్నారు.
అవే వక్ర మాటలు..
ధర్పల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఎంపీ అర్వింద్ రాకను పోలీసులు నిరాకరించారు. ఎంపీ అర్వింద్ నేరుగా ఇందల్వాయి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని డిచ్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో వక్ర మాటలే తప్ప రైతులకు తానిచ్చిన పసుపు బో ర్డు హామీపై మాత్రం ఎలాంటి మాట ఎత్తలేదు. పైగా మతపరమైన వ్యాఖ్యలతో రెచ్చగొట్టేలా మాట్లాడి అందరి దృష్టిని మరల్చే ప్రయత్నం చేశాడు. ధర్పల్లిలో ఆకుపచ్చ కండువాలు ధరించి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ నినదించిన విషయంపై పల్లెత్తు మాట ఎత్తకుండానే తాను చెప్పాలనుకున్నది చెప్పేసి చేతులు జోడించాడు. రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవని పలువురు అడిగినప్పటికీ కనీసం సమాధానం చెప్పకపోవడంతో ఇందూర్ వాసులంతా మండిపడుతున్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరుతో ప్రశాంతమైన నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు రాజ్యమేలుతున్నాయంటూ ఆయా వర్గాల ప్రజలు ఆరోపిస్తున్నారు. న్యాయబద్ధంగా ఎంపీ అర్వింద్ హామీలను ప్రశ్నించినందుకు తమపై రాళ్ల దాడులు చేయడం ఏంటంటూ రైతులంతా ఎదురు తిరుగుతున్నారు. బీజేపీ నాయకులంతా గూండాగిరీ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
ఉద్రిక్త పరిస్థితులు
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చోటుచేసుకున్న తోపులాట ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ధర్పల్లి మండల కేంద్రంలో గ్రామస్తులు చందాలు వేసుకొని స్థానికంగా శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ విగ్రహావిష్కరణకు కొందరు బీజేపీ కార్యకర్తలు ఎంపీ అర్వింద్‌ను ఆహ్వానించారు. పార్టీలకు అతీతంగా చందాలేసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే, బీజేపీ ఎంపీని ఎందుకు పిలుస్తున్నారంటూ సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాలరాజ్తోపాటు పలువురు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తంచేశారు. మరోవైపు శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎంపీ అర్వింద్ ధర్పల్లి వస్తున్నారని తెలిసి మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఎంపీని నిలదీసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ధర్పల్లికి వెళ్లవద్దని పోలీసులు ఎంపీ అర్వింద్‌ను వారించారు. దీంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేసిన అర్వింద్.. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలను ధర్పల్లికి రప్పించారు.
ఆయన ఆదేశాల మేరకు కాషాయ కండువాలు ధరించిన బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం వద్దకు చేరుకుని రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో గ్రామస్తులు సైతం బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. అన్ని పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న విగ్రహానికి కాషాయరంగు పులమడమేమిటని వారు ప్రశ్నించారు. సర్పంచ్‌నైన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఎంపీ పేరిట విగ్రహావిష్కరణ శిలాఫలకం ఏర్పాటు చేయడమేమిటని సర్పంచ్ పెద్దబాలరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీపీ, జడ్పీటీసీలకు ఆహ్వానం పంపకుండా ఎంపీని నేరుగా పిలిపించడమేమిటని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, మాజీ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజ్‌పాల్‌రెడ్డి తదితరులు బీజేపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమవద్ద చందాలు తీసుకుని ఏర్పాటు చేసిన విగ్రహానికి ఎంపీని ఎందుకు ఆహ్వానించారని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయగా.. ఉద్రిక్తతల మధ్యే సర్పంచ్ ఆర్మూ ర్ పెద్దబాలరాజ్, గ్రామ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో విషయం అర్వింద్‌కు ఫోన్ ద్వారా చేరవేసిన బీజేపీ కార్యకర్తలు విగ్రహానికి తిరిగి ముసుగేసి గ్రామస్తులతో తోపులాటకు దిగారు. ఒకవైపు రైతులు, గ్రామస్తులు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయగా.. బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు అర్వింద్‌కు అనుకూల నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా రైతులపైకి రాళ్లు విసరడం ప్రారంభించిన బీజేపీ కార్యకర్తలు.. అడ్డుకోబోయిన పోలీసులపైనా దాడికి దిగారు.
పెరుగుతున్న వ్యతిరేకత..
ఎంపీ అర్వింద్ తీరుపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో గట్టెక్కిన బీజేపీ అంటేనే రైతులంతా కోపోద్రిక్తులు అవుతున్నారు. పసుపు బోర్డుతోపాటు పసుపు పంటకు కనీస మద్దతు ధర రూ.15వేలు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పన అంశాలన్నీ అటకెక్కించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. చైతన్యానికి ప్రతీకగా నిలిచే నిజామాబాద్ ప్రాంత ప్రజలు మాత్రం ఎంపీని వెంటాడుతూనే ఉన్నారు. ఇచ్చిన హామీ ఏమైదంటూ కొద్ది కాలంగా నిలదీస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏడాది కాలం పాటు సహనంతో వేచి చూసిన రైతన్నలే ఇప్పుడు తిరగబడుతున్నారు. ఇందుకు వరసగా ధర్మపురి అర్వింద్‌కు ఎదురవుతున్న చేదు అనుభవాలే రుజువుగా నిలుస్తున్నాయి. బాండ్ పేపర్ జిరాక్స్ ప్రతులతో రోడ్డెక్కి ప్రదర్శనలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ ఎంపీ అర్వింద్‌కు నిజామాబాద్ వాసులు చుక్కలు చూపిస్తున్నారు. పసుపు బోర్డు పేరు ఎత్తగానే ముఖం చాటేస్తూ బీజేపీ ఎంపీ కాలం గడిపేస్తున్నారు.
పరిస్థితిని సమీక్షించిన అదనపు సీపీ
విషయం తెలుసుకున్న జిల్లా అదనపు సీపీ డాక్టర్ జి.వినీత్ పరిస్థితిని సమీక్షించారు. బీజేపీ నాయకులు ర్యాలీ తీసేందుకు అదనపు సీపీ అనుమతినిచ్చి వారిని గ్రామంలోకి వెళ్లేలా చూశారు. మరోవైపు రైతులు, నాయకులను అడ్డుకొని వెనుదిరిగేలా చేశారు. దీంతో సుమారు 4గంటల పాటు చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణానికి తెర పడింది. సంఘటనను తమ సిబ్బంది వీడియో తీశారని, మీడియా వద్ద ఉన్న ఫుటేజీలను సేకరించి రాళ్లు రువ్విన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు సీపీ తెలిపారు.
ఎంపీని అడ్డుకోవడానికే వచ్చాం
కల్లబొల్లి మాటలతో రైతులను నమ్మించి మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన ఎంపీ ధర్మపురి అర్వింద్ ధర్పల్లికి వస్తున్నారని తెలవడంతో అడ్డుకోవడానికి రైతులందరం స్వచ్ఛందంగా తరలివచ్చాం. రైతుల కోసం పాటుపడాల్సింది పోయి, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారును బద్నాం చేస్తున్న ఎంపీలకు మేమే గుణపాఠం చెబుతాం.
–శేఖర్‌రెడ్డి, రైతు, దుబ్బాక గ్రామం