ప్రధాని మోదీ తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్నరు..
పోరాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్ర
కమలం నేతల తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్, మోర్తాడ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వేల్పూర్/ మోర్తాడ్, ఫిబ్రవరి 19 : తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ విషం చిమ్ముతున్నదని, తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపే కుట్రలు చేస్తున్నారని.. రాష్ర్టానికి అన్యాయం చేస్తున్న బీజేపీ నాయకులు గ్రామాలకు వస్తే ప్రజలు నిలదీయాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలంలోని అక్లూర్, జాన్కంపేట్, సాహేబ్పేట్, వెంకటాపూర్తోపాటు మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. మోర్తాడ్ మండలం దొన్కల్‌లో రూ.15లక్షలతో చేపట్టే సీసీ రోడ్లకు, ధర్మోరాలో గౌడ సంఘ భవనం, సీసీ రోడ్లు, శెట్పల్లిలో బీటీరోడ్డు పునరుద్ధరణ పనులు, సీసీ రోడ్లకు, తిమ్మాపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించే జీపీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో కేవలం మూడు రోజుల్లో రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్లమెంట్ వేదికగా ప్రధానమంత్రి మోదీ పలుమార్లు తెలంగాణ రాష్ట్ర విభజనపై మాట్లాడుతున్నారంటే కచ్చితంగా ఇది తెలంగాణ మీద జరుగుతున్న కుట్రనే అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. జాతీయ రహదారి -16 నుంచి రూ.15 కోట్లతో కుకునూర్ ఎక్స్‌రోడ్డు నుంచి వేల్పూర్ వరకు, జాతీయరహదారి-44 నుంచి రూ.21 కోట్లతో తొర్లికొండ, బ్రాహ్మణ్‌పల్లి, జాన్కంపేట్, సాహేబ్పేట్, వేల్పూర్ వరకు డబుల్ రోడ్డు కోసం తానే ప్రతిపాదనలు పంపి.. ఈ రెండు కొత్త రోడ్లు తీసుకువచ్చానని చెప్పారు. ఎంపీ అర్వింద్ మాత్రం తానే ఈ రోడ్లుకు నిధులు మంజూరు చేయించానని, ఆయా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అర్వింద్ కొరుట్ల నియోజకవర్గంలో ఒక రోడ్‌కు మాత్రమే ప్రతిపాదనలు పంపారని తెలిపారు.
మోదీతో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలి
తెలంగాణ పుట్టుకను పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించిన ప్రధాని మోదీతో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రాను చంపి తెలంగాణను ఏర్పాటు చేశారని మాట్లాడుతున్న మోదీ, అమిత్‌షా మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలిపేందుకు కుట్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు.
వేల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు అల్లకొండ భారతి, ఎంపీటీసీలు సత్తెమ్మ, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్, సర్పంచులు రమేశ్, సుధాకర్‌గౌడ్, ఆర్టీఏ సభ్యుడు రేగుళ్ల రాములు పాల్గొన్నారు.
మోర్తాడ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ కమిటీ సభ్యుడు సంజీవ్‌రెడ్డి, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్స దేవన్న, డీసీసీబీ డైరెక్టర్ భూమన్న, సర్పంచులు గడ్డం చిన్నారెడ్డి, లావణ్య, మండల రాజేశ్వర్, బద్దం గంగారెడ్డి, ఎంపీటీసీలు అశోక్, లత, శ్రీనివాస్, ఆస్మా తదితరులు పాల్గొన్నారు.