క్షేత్రస్థాయిలో సందర్శించిన గోదావరి యాజమాన్య కమిటీ బోర్డు సభ్యుడు కుటియాల్వార్
రెంజల్, ఫిబ్రవరి 19: మండలంలోని కందకుర్తి సమీపంలో ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం స్థితిగతులను గోదావరి యాజమాన్య కమిటీ బోర్డు సభ్యుడు కుటియాల్వార్ శనివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. జిల్లాలోని నది పరీవాహక ప్రాంతాల్లో 16 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయని జిల్లా జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ బద్రీ నారాయణ వివరించారు. 2003లో ఉపయోగంలోకి వచ్చిన తర్వాత కందకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టు కింద ఎంత మేరకు సాగునీరందుతుందని, రైతులు ఏ పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నారని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా నీరందించాలని అధికారులను ఆదేశించారు. కందకుర్తి స్టేజ్ – 1లో రెండు రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ పనిచేయకపోవడంతో సాగుకు ఇబ్బంది కలుగుతున్నదని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు గోదావరిలో నిల్వ ఉన్న నీటి సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమ విశిష్టతను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎత్తిపోతల పథకం స్థితిగతులపై బోర్డు చైర్మన్‌కు నివేదిస్తామని కుటియాల్వార్ చెప్పారు. వారి వెంట ఉప పర్యవేక్షక ఇంజినీర్ ఉదయ్‌కుమార్, ఈఈ పద్మిని, డీఈ సురేశ్, ఏఈ స్వాతి, నవీపేట డీఈ బలరాం, ఏఈ ప్రణయ్ తదితరులు ఉన్నారు.