కామారెడ్డి, మే 20 :జిల్లాలో రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన రౌడీషీటర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీయిజానికి ప్రోత్సాహమిచ్చే ఎలాంటి చర్యలకు జిల్లాలో చోటులేదని స్పష్టం చేశారు. రౌడీ షీటర్లు మళ్లీ నేరాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలను బెదిరించడం,డబ్బులు వసూలు చేయడం, హింసాత్మక చర్యలు చేయడం లాంటి నేరాలను పూర్తిగా మానుకోవాలని సూచించారు.కేవలం మంచి ప్రవర్తన కనబరిచిన వారి రౌడీషీట్లు మాత్రమే తొలగిస్తామని చెప్పారు. నేరరహిత సమాజ నిర్మాణం కోసం జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. సాధారణ జీవితం గడుపుతూ ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా పోలీసు రికార్డ్సు, రౌడీ షీట్లు రివ్యూ కమిటీ నివేదిక ప్రకారం మంచి ప్రవర్తన కలిగి ఉన్న 13 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్లు తొలగించామని తెలిపారు.
వీరు భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.13 మందిలో వచ్చిన మార్పులు ఇతరులు కూడా చూసి సత్ప్రవర్తన కలిగి పదేండ్లు ఎలాంటి కేసులు లేకుండా ఉంటే నిష్పక్షపాత విచారణ, రౌడీ షీట్స్ రివ్యూ చేయడానికి ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల కమిటీ నివేదిక ప్రకారం వారి షీట్స్ కూడా తొలగిస్తామని వివరించారు.
గంజాయి,రౌడీయిజం, హత్యలు, గొడవలు ఇతర అసాంఘిక కార్యకలాపాల్లో తిరిగి పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదుచేస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, డీసీఆర్బీ సీఐ మురళి, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.