కామారెడ్డి, నవంబర్ 16: పోలీస్‌స్టేషన్‌లో ఉన్న బైకును సొంతానికి వాడుకున్న కానిస్టేబుల్‌పై కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర సస్పెన్షన్ వేటు వేశారు. అతడిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏ.విశ్వనాథం అనే కానిస్టేబుల్ కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో పీఎస్‌లో ఉన్న ఒక బజాజ్ పల్సర్ (టీఎస్ 09 జీఎల్ టీఆర్ 6686)ను అనుమతి లేకుండా తన సొంతానికి వాడుకున్నాడు.
అనంతరం దానిని ప్రశాంత్ అనే మెకానిక్ దుకాణం వద్ద ఉంచాడు. కాగా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వాహనాలను చెక్ చేస్తు న్న విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ విశ్వనాథం.. ఆదివారం బైక్‌ను తీసుకువచ్చి పోలీస్‌స్టేషన్‌లో నిలిపి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎస్పీకి తెలియడంతో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కానిస్టేబుల్ గాంధారి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలకు సేవ చేయాలని, నిజాయితీతో విధులు నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉన్నదన్నారు.