నిజామాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ విధానామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాల మేరకు కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని గుర్తు చేశారు. కామారెడ్డి రైతు జేఏసీ ప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిశారు. పాత మాస్టర్‌ప్లాన్ అమలులో ఉంటుందని మంత్రి వారికి స్పష్టం చేశారు. అలాగే, నిరసనల సందర్భంగా రైతులపై నమోదైన కేసులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటామని రామారావు హామీ ఇవ్వడంతో అన్నదాతలు ధన్యవాదాలు తెలిపారు.
రైతన్నలకు నష్టం వాటిల్లే మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను రద్దు చేస్తున్నట్లు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించగా.. తాజాగా ఇదే అంశాన్ని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ పాతదే అమల్లో ఉంటుందంటూ కేటీఆర్ స్వయంగా హామీ ఇవ్వడంతో కామారెడ్డి రైతు జేఏసీ హర్షం వ్యక్తం చేస్తున్నది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో కామారెడ్డి రైతు జేఏసీ బృందం శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యింది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై చర్చ రాగా వెంటనే రద్దు చేస్తున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్‌ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ చేసిన ప్రకటనను పురపాలక మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. రైతుల సమావేశం సందర్భంగా మరోసారి డీటీసీపీ అధికారులతో కేటీఆర్ మాట్లాడారు. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తాము అండగా ఉంటామని వారికి కొండంత భరోసాను కేటీఆర్ అందించారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందని చెప్పారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తెలిపిన కేటీఆర్‌కు రైతు జేఏసీ నాయకులంతా ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ హామీపై పూర్తి భరోసా తమకు ఉందని రైతు జేఏసీ వెల్లడించింది. రైతు జేఏసీ తరపున నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ నుంచి వివరాలను కేటీఆర్ తెలుసుకున్నారు. ఈ అంశంలో రాష్ట్ర డీజీపీతోనూ కేటీఆర్ మాట్లాడారు.
రైతన్నకు ఏనాడూ కష్టం రానివ్వని కేసీఆర్
రైతులకు నేనున్నానంటూ ముందుండే సీఎం కేసీఆర్ తన పదేండ్లే పాలనలో ఏనాడు ఏ చిన్న కష్టాన్ని రానివ్వలేదు. దేశ వ్యాప్తంగా తెలంగాణ మినహా అనేక రాష్ర్టాల్లో అన్నదాతలు పడరాని కష్టాలు పడుతున్నారు. కరెంట్ లేక, సాగు నీరు అందక, ఎరువులు, విత్తనాలు సమయానికి చేరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్టుబడికి పైసల్లేక అప్పులు చేసి చితికి పోతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం రైతుల పరిస్థితి వేరు. రైతుబంధు రూపంలో పెట్టుబడి సాయంతో మొదలు పెడితే సాగుకు 24గంటల ఉచిత విద్యుత్ వరకు కేసీఆర్ సహా య, సహకారాలు అందిస్తున్నారు. కేసీఆర్ పరిపాలన.. రైతు ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. కానీ ప్రతిపక్ష పార్టీలు చీటికి మాటికి బురద రాజకీయాలతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే మాస్టర్ ప్లాన్ అంశంతో రైతుల మనోభావాలను ముడిపెట్టి రెచ్చగొట్టి గొడవలకు దారి చూపుతున్నాయి. అన్నదాతలకు కష్టం వా టిల్లే మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను రద్దు చేస్తున్నట్లుగా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించగా తాజాగా ఇదే అంశాన్ని శనివారం హైదరాబాద్‌లో పురపాలక మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టతను ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ పాతదే అమల్లో ఉంటుందంటూ కేటీఆర్ స్వయంగా హామీ ఇవ్వడంతో కామారెడ్డి రైతు జేఏసీ హర్షం వ్యక్తం చేస్తోంది.
పది నెలల క్రితమే తీర్మానం ఆమోదం
కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను 2023, జనవరిలోనే పాలకవర్గం రద్దు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీలో సభ్యులంతా మూ కుమ్మడిగా ముసాయిదా రద్దుకే మద్దతు తెలిపి తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపించింది. కేసీఆర్ ప్రభుత్వం రైతు కేంద్రంగా అనేక పథకాలను తీసుకు వచ్చి రైతును రాజు చేస్తున్న తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం కుటిల రాజకీయాలతో బద్నాం చేసే కుట్రలకు దిగుతోంది. ఇందుకు కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌పై బీజేపీ ఆడిన ఆటలే ఇందుకు నిదర్శనం. అభ్యంతరాలు చెప్పకుండా కేవలం బీఆర్ఎస్ సర్కారును ఇబ్బంది పెట్టేందుకు రైతులను పావుగా వాడుకుని పబ్బం గడిపింది. ఎన్నికల్లో నేరుగా గెలవలేక మరోసారి ఇదే డ్రామాలకు ప్రతిపక్ష పార్టీలు తెరలేపడంపై ప్రజలంతా ఆ పార్టీలను చీత్కరిస్తున్నారు.