కామారెడ్డి, జూన్ 1: రాష్ట్ర సాధన కోసం ప్రారంభమైన పోరులో కామారెడ్డి ప్రాంతం మొదటి నుంచి అండగా నిలిచింది. పిడికెడు మందితో మొదలైన తెలంగాణ రాష్ట్రసమితికి తొలినాళ్లలో కామారెడ్డి ప్రాంతానికి చెందినవారు మద్దతుగా నిలిచారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత కరీంనగర్ బహిరంగ సభకు కామారెడ్డి బార్ అసోసియేషన్‌లో మొదట తీర్మానం చేసి కేసీఆర్‌కు కొండంత ధైర్యాన్నిచ్చారు. బార్ అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిర్మల్‌రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ సభకు తరలివెళ్లి కేసీఆర్ పోరాటానికి మద్దతు తెలిపారు.
స్వరాష్ట్రకాంక్ష బలంగా వినిపించిన ప్రాంతాల్లో కామారెడ్డి ప్రాంతం ముఖ్యమైంది. ఉద్యమంలో భాగంగా తెలంగాణ కూలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిగేడియర్‌గా కామారెడ్డి ఇన్చార్జిగా కేసీఆర్ పాల్గొన్నారు. పార్టీ నడిపేందుకు అయ్యే ఖర్చులు, బహిరంగ సభల కోసం పార్టీ శ్రేణులు కూలి పని చేయాలని నిర్ణయించి కూలి ద్వారా నిధి సేకరణ చేపట్టారు. కామారెడ్డి పట్టణంలో దేశాయి బీడీ ఫ్యాక్టరీ గోడౌన్లో తెలంగాణ కూలికి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీడీ బెండళ్లను స్వయంగా మోశారు. అనంతరం కామారెడ్డి గాంధీ గంజ్‌లో బెల్లం ముద్దలను మోశారు. టీఆర్ఎస్ పురుడు పోసుకున్న సమయంలో కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో అన్ని గ్రామాల్లో మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సంచలనం సృష్టించింది.
తెలంగాణ కోసం తొలి ఆత్మార్పణ కానిస్టేబుల్ కిష్టయ్యదే. 2009 నవంబర్ 30న కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షకు దిగారు. అదే సమయంలో ప్రత్యేకరాష్ట్రం కోసం కామారెడ్డి పట్టణంలో సెల్ టవరెక్కిన పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మబలిదానం చేసుకున్నాడు. విధుల్లో ఉన్న కిష్టయ్య తుపాకీతో కాల్చుకొని అమరుడయ్యాడు. అనంతరం ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కానిస్టేబుల్ కూతురును డాక్టర్ చదివించాడు.భార్యకు ఉద్యోగం కల్పించాడు.