కామారెడ్డి రూరల్, ఆగస్టు 27: అతడో ఘరానా దొంగ. ఒకటి, రెండు కాదు ఏకంగా 102 కేసుల్లో నిందితుడు. కామారెడ్డి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి ఠాణాలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్సైలు రాజు, మధుసూదన్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. దేవునిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని గోష్కరాజయ్య కాలనీకి చెందిన ఇంజమూరి రాములు ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు రూరల్ సీఐ రామన్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
మంగళవారం నరసన్నపల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో చిక్కాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, గోష్కరాజయ్య కాలనీలో జరిగిన దొంగతనం, కామారెడ్డిలో బైక్ చోరీ చేసింది అతడేనని తేలింది. అలాగే అతడి గురించి పూర్తి వివరాలు సేకరించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు హైదరాబాద్ టోలిచౌకీ పారామౌంట్ కాలనీకి చెందిన మీర్ కజామ్ అలీఖాన్ అలియాస్ సూర్యాభాయ్గా గుర్తించిన పోలీసులు అతడిపై ఉన్న కేసులు చూసి షాక్ అయ్యారు.
హైదరాబాద్ కమిషనరేట్‌తోపాటు సంగారెడ్డి జిల్లా పరిధిలోని 102 కేసుల్లో అలీఖాన్ నిందితుడని గుర్తించారు. విచారణలో దొంగతనం చేసినట్లు అంగీకరించిన అతడు.. నగలు దాచిన ప్రాంతానికి తీసుకెళ్లగా, పోలీసులు బంగారంతోపాటు ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితున్ని కామారెడ్డి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు. ఘరానా దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన దేవునిపల్లి ఎస్సై రాజు, ఎస్సై-2 మధుసూదన్‌రెడ్డి, క్రైం కానిస్టేబుల్ రామస్వామి, బాలకృష్ణ, హోంగార్డు రాజు, టెక్నికల్ సిబ్బంది రోహిత్, శ్రీనులను ఎస్పీ సింధూశర్మ అభినందించారు.