నిజామాబాద్, అక్టోబర్ 29, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్ మాస్టర్ ప్లాన్ అంశం ప్రస్తుతం తెర మీదికి వచ్చింది. అమృత్ 2.0లో భాగంగా ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తైంది. సమాచార సేకరణ చేపడుతున్నారు. అమృత్ 1.0లో నిజామాబాద్ నగరపాలక సంస్థ, కామారెడ్డి మున్సిపాలిటీ ముసాయిదా రూపకల్పన చేశారు. ఇప్పటి వరకూ ఈ అంశం ఆమోదం పొందలేదు. అంతలోనే అమృత్ 2.0 తెర మీదికి రావడంతో కొన్ని చోట్ల భయాలు, మరికొన్ని చోట్ల కొంగొత్త ఆశలు చిగురిస్తున్నా యి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టణాభివృద్ధిని ఆకాంక్షిస్తూ భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనే సదుద్దేశంతో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయ వస్తువుగా మార్చుకుని రైతులను ప్రభుత్వంపైకి ఉసిగొల్పి ముసాయిదా అమలు కాకుండా అడ్డు తగిలారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల్లో కొత్తగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియ షురూ అయ్యింది. ప్రస్తుతం ఆర్మూర్‌కు బీజేపీ ఎమ్మెల్యే, బోధన్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి బీజేపీ ఎంపీ కొనసాగుతున్నారు. గతంలో కామారెడ్డిలో రాజకీయ దుమారానికి కారణమైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు ఏ విధంగా ప్రజా ప్రయోజనానికి పాటు పడుతాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్ద పీట వేస్తుందా? చెలరేగే అసంతృప్తిని ఏ విధంగా రూపుమాపుతుందనేది ఆసక్తిగా మారింది. అక్టోబర్ 28(మంగళవారం) నిజామాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన డీటీసీపీ అధికార బృందం ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల్లో తీసుకు రాబోయే మాస్టర్ ప్లాన్ ముసాయిదా ఓవైపు రాష్ట్ర ప్రభుత్వానికి, మరోవైపు ప్రజలకు ముఖ్యమైన పాఠంగా నిలువనుంది. కామారెడ్డి సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షించి 2022 చివర్లో కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముసాయిదాను విడుదల చేసింది. 2023 జనవరిలో ముసాయిదాపై పలు గ్రామాల్లో తీవ్ర పోరాటాలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెర మీదికి వచ్చి మాస్టర్ ప్లాన్ అంశాన్ని వివాదాస్పద అంశంగా మార్చాయి. రైతులను ఉసిగొల్పి ముసాయిదా అమలు కాకుండా అడ్డుకున్నారు.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 6155 హెక్టార్ల భూమిని కవర్ చేసే ప్లాన్‌లో వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్ జోన్‌గా మార్చేశారంటూ రైతులను రెచ్చగొట్టారు. వాణిజ్యపరంగా రైతుల అభివృద్ధిని కోరుతూ గత సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. రైతుల మనోభావాలను గౌరవిస్తూ నాటి ప్రభుత్వం ఏకంగా మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కామారెడ్డి పట్టణ ప్రణాళికపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముసాయిదా విడుదలపై తెరవెనుక సన్నాహకాలు జరుగుతున్నాయి. కామారెడ్డి సంఘటనలు ఆర్మూర్, బోధన్ ప్రజల్లో భయాలను మరింత పెంచనున్నాయి. గత గుణపాఠాలను నేర్చుకుని మాస్టర్ ప్లాన్‌ను అందరూ మెచ్చే విధంగా తీర్చిదిద్దాలని ఆర్మూర్, బోధన్ ప్రజలంతా కోరుతున్నప్పటికీ పారదర్శకంగా భవిష్యత్ ప్రణాళికను తీర్చిదిద్దుతారా? అన్నది సందేహం ఏర్పడుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాభివృద్ధి పేరుతో మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్ తయారీకి అడుగులు వేస్తోంది. 2024, అక్టోబర్‌లో జారీ చేసిన జీవో నెంబర్ 68 ప్రకారం 23 జిల్లాల్లో ఇప్పటికే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(యూడీఏ)లు ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీలను విస్తరించడంతో పాటుగా ఆయా పురపాలక సంఘాల్లో గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. 380 గ్రామాలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో చేర్చబడ్డాయి. ఇదీ 2050 వరకు భవిష్యత్ అభివృద్ధికి మార్గసూచిగా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఆర్మూర్ మున్సిపాలిటీ వెబ్సైట్లో మాస్టర్ ప్లాన్ వివరాలు అప్డేట్ అయ్యాయి. ఇది భూమి ఉపయోగం, రోడ్లు, పార్కులు, ఇండస్ట్రియల్ జోన్లు గురించి సమగ్ర ప్రణాళికకు సంబంధించింది. బోధన్‌కు కూడా ఇదే ప్రక్రియలో ముసాయిదా తయారవుతోంది.
ఈ ప్లాన్లు పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చడం ద్వారా ఉద్యోగాలు, మౌళిక సదుపాయాలు పెంచడానికి దోహదం చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రజల్లో ఈ పట్టణ ప్రణాళికపై భయాలు పెరుగుతున్నాయి. రైతులు, చిన్న వ్యాపారులు మాస్టర్ ప్లాన్‌లో తమ భూములు ఇండస్ట్రియల్ లేదా రిక్రియేషన్ జోన్లుగా మారిపోతే వారి జీవనాధారం ప్రశ్నార్ధకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు పంటలు సమృద్ధిగా పండే పచ్చని పొలాలను ఫ్యాక్టరీలకు మారిపోతే రైతులు రోడ్డున పడే వీలుంది. బోధన్‌లో కూడా గ్రామీణ ప్రాంతాల్లోని భూములు పట్టణ విస్తరణకు ఉపయోగపడితే భూమి విలువలు పెరిగి చిన్న రైతులు వలస బాట పట్టాల్సి వస్తుందనే భయాలు పెరుగుతున్నాయి. మాస్టర్ ప్లాన్ పేరుతో అభివృద్ధికి మచ్చుతునకలా మున్సిపాలిటీలను మార్చుతామంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంత భూములపై మాస్టర్ ప్లాన్ తీవ్రమైన ఒత్తిడి పెంచే అవకాశాలు ఏర్పడనున్నాయి.