కామారెడ్డి, ఏప్రిల్ 9: పన్నుల వసూళ్లలో కామారెడ్డి బల్దియా వెనుకబడి పోయింది. ఒకప్పుడు రాష్ట్రంలోనే ముందుండే ఈ మున్సిపాలిటీ ఇప్పుడు అధమ స్థాయికి దిగజారింది. రెండేండ్లుగా బల్దియా పనితీరు అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఆ ప్రభావం వసూళ్లపైనా పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత పట్టణం విస్తరించడంతో పాటు అనేక వాణిజ్య సముదాయాలు వెలుస్తున్నాయి.
అదే స్థాయిలో పన్ను వసూళ్లు మాత్రం కావడం లేదు. ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టిన తరుణంలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రెండేండ్లలో అనధికార నిర్మాణాలపై 47 ఫిర్యాదులు, 400లకు పైగా వాణిజ్య దుకాణాల ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్స్ పెండింగ్‌లో ఉన్నాయని, ఫలితంగా ప్రభుత్వానికి రూ.కోటికి పైగా నష్టం వాటిల్లిందని గుర్తించారు. దీన్ని బట్టి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ఏడాదికి పైగా పాలకవర్గం లేక మున్సిపల్ అధికారులదే పెత్తనం నడిచింది. అడిగే వారు, అజమాయిషీ చేసే వారు లేకపోవడంతో కొందరు అక్రమ సంపాదనపై దృష్టి పెట్టారు తప్పితే పన్ను వసూళ్లను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పాలకవర్గం కొలువుదీరి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ బల్దియా పాలన గాడిన పడలేదు. ఇటీవలి బడ్జెట్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డిపై కౌన్సిలర్లంతా మూకుమ్మడిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయనను వెంటనే సరెండర్ చేయాలని అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌తో పాటు టీపీవో సెలవుపై వెళ్లారు. సానిటరీ ఇన్స్పెక్టర్ సైతం లీవ్‌లో కొనసాగుతున్నాడు. ముఖ్యమైన అధికారులు సెలవులో ఉండడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. మున్సిపల్ బాధ్యతలు చూస్తున్న ఆర్డీవో గిరి.. అదనపు పనిభారంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేక పోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కామారెడ్డి బల్దియాలో భారీగా పన్ను బకాయిలు పేరు కు పోయాయి. ఇందులో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలే అత్యధికంగా ఉండడం గమనార్హం. 2025-26 ఆస్తి పన్ను డిమాండ్ రూ.15.44 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.9.13 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మిగిలిన రూ.6.42 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉన్నది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ దవాఖాన మొదటి స్థానంలో ఉండగా, రైల్వే స్టేషన్ రెండో స్ధానంలో ఉన్నది.