కామారెడ్డి,మార్చి 28: కామారెడ్డి మున్సిపల్ మొదటి బడ్జెట్ సమావేశం శనివారం రసాభాసగా మారింది. పారిశుద్ధ్యం సహా ఇతర సమస్యలపై కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన దాదాపు నాలుగు గంటల పాటు సాగిన బడ్జెట్ సమావేశం ఆద్యంతం వాడీవేడిగా కొనసాగింది. అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీవో గిరి తదితరులు హాజరైన ఈ సమావేశంలో కౌన్సిలర్లు అధికారులపై నిప్పులు చెరిగారు.
ఈ క్రమంలో కౌన్సిలర్లకు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌కు మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, అయినా కమిషనర్ పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. పాలకవర్గం కొలువు దీరి ఇన్ని రోజులైనా జనరల్ సమావేశం ఏర్పాటు చేయక పోవడంపై నిలదీశారు. తమ ఫోన్లు ఎత్తడం లేదని కౌన్సిలర్లు చెప్పగా, తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని చైర్పర్సన్ ఉమారాణి అన్నారు. చైర్పర్సన్ పరిస్థితే ఇలా ఉంటే ఎలా అని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వార్డుల్లో అభివృద్ధి పనులే జరుగడం లేదని అధికార పార్టీ సభ్యులు మొర పెట్టుకున్నారు.
టీపీవో గిరిధర్ సమావేశం మధ్య నుంచి వెళ్లిపోవడంపైనా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, టీపీవో సెలవులో ఉన్నాడని, బడ్జెట్ సమావేశానికి ఒకసారి రావాలని చెప్పడంతో వచ్చాడని కమిషనర్ బదులిచ్చారు. బడ్జెట్ సమావేశం ఉందని తెలిసీ సెలవు ఎలా ఇస్తారని కౌన్సిలర్లు ప్రశ్నించారు. వార్డుల్లో శానిటేషన్ చాలా అధ్వానంగా ఉందని, మున్సిపల్ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్ గరిగంటి లక్ష్మీ నారాయణ నిలదీశారు. మిగతా కౌన్సిలర్లు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, కమిషనర్, టీపీవోను సరెండర్ చేయాలని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియం వద్దకు అదనపు కలెక్టర్ మధుమోహన్‌కు విన్నవించారు. చివరకు రూ.70.86 కోట్ల బడ్జెట్‌కు మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందారు.