నిజామాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధూశర్మ త్వరలో బదిలీ కానున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్‌కు బదిలీచేయాలని ఆమె ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. సింధూశర్మ ఏడాదిగా కామారెడ్డి ఎస్పీగా పనిచేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఏర్పాటు తర్వాత తొలి ఎస్పీగా శ్వేతారెడ్డి పనిచేశారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి విధులు నిర్వహించారు. కామారెడ్డికి మూడో ఎస్పీగా వచ్చిన సింధూశర్మ పోలీసు శాఖపై తనదైన ముద్రవేశారు.
అయితే, వ్యక్తిగత కారణాల రీత్యా తనను హైదరాబాద్‌కు బదిలీ చేయాలని విజ్ఞప్తి పెట్టుకున్నట్లు తెలిసింది. ఆమె కోరికను ప్రభుత్వం మన్నించే అవకాశాలున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. కామారెడ్డి ఎస్పీ సింధూశర్మకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. నెలన్నర రోజులు గడిచిపోయినప్పటికీ నిజామాబాద్ సీపీని ఇంతవరకు నియమించలేదు. అదే సమయంలో కామారెడ్డి ఎస్పీ బదిలీకి విన్నవించడంతో.. రెండు జిల్లాలకు ఒకేసారి పోలీస్ ఉన్నతాధికారులను నియమించే అవకాశముంది.