డిచ్పల్లి, ఆగస్టు 20: మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు సంజీవనిలా భావించే డయాలసిస్ సెంటర్ డిచ్‌పల్లిలో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డయాలసిస్ కేంద్రాలు సామాజిక దవాఖాన స్థాయిలో తీసుకురావడం చారిత్రాత్మకం. గతంలో డయాలసిస్ అవసరం ఉంటే కచ్చితంగా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేంది. ఇది ఖర్చుతో కూడుకున్న పని. అక్కడికి వెళ్లి డయాలసిస్ చేయించుకోలేక చాలా మంది తనువు చాలించారు. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రాల్లో మొదట ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఎంతో మంది ప్రాణాలను నిలిచాయి. ప్రస్తుతం ప్రజలకు మరింత చేరువలో ఉంటే సామాజిక దవాఖానలోనూ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామం. ఇందులో భాగంగా డిచ్పల్లి సామాజిక వైద్యశాలలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కనీసం 100 గ్రామాల్లోని రోగులకు సేవలు అందుబాటులోకి వస్తాయి. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి మండలాల కిడ్నీ బాధితులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
డయాలసిస్ ఎవరికి అవసరం?
కిడ్నీలు రోజుకు సుమారు 400 సార్లు రక్తాన్ని వడపోస్తాయి. ఒక్కో మూత్రపిండంలో ఉండే దాదాపు 10 లక్షల వడపోత విభాగాలు (నెప్రోన్లు) నిరంతరం ఈ పనిలోనే మునిగి ఉంటాయి. ఇవి రోజుకు సుమారు 150 లీటర్ల రక్తాన్ని జల్లెడ పడుతాయి. సుమారు రెండు లీటర్ల మూత్రాన్ని తయారు చేస్తాయి. పోషకాలను కణాలు వినియోగించుకున్న తర్వాత వెలువడే వ్యర్థాలు, విషతుల్యాలన్ని మూత్రం ద్వారా బయటికి పోతాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వాటి వడపోత ప్రక్రియ దెబ్బతిని ఒళ్లంతా వ్యర్థాలు, ద్రవాలు పేరుకుపోతాయి. కిడ్నీలు రెండూ చెడిపోయినప్పుడు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. కిడ్నీలు విఫలమైన వారిలో ఆకలి మందగించడం, వికారం, వాంతులు, కాళ్లవాపు, ఆయాసం, ఒళ్లంతా దురదలు వంటి లక్షణాలు కనబడతాయి. కొందరికి మగత, ఫిట్స్ వంటివి ఉండొచ్చు.
ఇలాంటి లక్షణాలు ఎక్కువగా వేధిస్తున్నాయంటే డయాలసిస్ అవసరముందని అర్థం. కిడ్నీ వడపోత సామర్థ్యాన్ని సూచించే జీఎఫ్ఆర్ (గ్లోమరులో ఫిల్టరేషన్ రేట్) 15 కన్నా తక్కువగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. వెంటనే అప్రమత్తం కాకపోతే ప్రాణాపాయానికి దారితీయచ్చు. డయాలసిస్‌లో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది పెరిటోనియల్ డయాలసిస్. ఇది పొట్ట కుహరంలోకి నేరుగా ద్రవాన్ని పంపించి రక్తాన్ని శుద్ధిచేసే ప్రక్రియ. పొట్ట కుహరంలోని కేశనాళికల్లో ప్రవహించే రక్తంలోని వ్యర్థాలన్నీ బయటినుంచి పంపించిన ద్రవంలోకి చేరుకుంటాయి. తర్వాత ఆ ద్రవాన్ని బయటకు తీస్తారు. దీంతో రక్తంలోని తొలగిపోయి రక్తం శుద్ధి అవుతుంది.
రెండోది హిమో డయాలసిస్. రక్తాన్ని బయటకు తీసి యంత్రం ద్వారా శుద్ధి చేసి తిరిగి ఒంట్లోకి పంపించడం దీని ప్రత్యేకత. డయాలసిస్ యంత్రంలోని వడపోత విభాగం (డయలైజర్)లో వెంట్రుకంత సన్నటి గొట్టాలుంటాయి. రక్తనాళం నుంచి బయటకు వచ్చిన రక్తం ప్రవహించేది వీటిల్లోంచే. అతి పలుచటి పొరతో కూడిన ఈ గొట్టాల చుట్టూరా నీటితో పాటు నిర్ణీత ప్రమాణాల్లో కాల్షియం, సోడియం, పొటాషియం, టైకార్బోనేట్ వంటి లవణాలను కలిపిన ప్రత్యేకమైన ద్రవం తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో రక్తంలోని వ్యర్థాలన్నీ ద్రవంలోకి చేరుకుంటాయి. వ్యర్థాలతో కూడిన ఈ ద్రవం బయటికి వస్తుంటే కొత్త ద్రవం లోపలికి వెళ్తుంది. తర్వాత శుద్ధి అయిన రక్తం తిరిగి ఒంట్లోకి చేరుకుంటుంది. ఇదంతా ఒక క్రమ పద్ధ్దతిలో జరుగుతూ ఉంటుంది.