ఎల్లారెడ్డి, ఆగస్టు 20: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ శివారులో ఉన్న ప్రభుత్వ గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 11 గంటల తరువాత విద్యార్థినులు వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో వెంటనే హాస్టల్ సిబ్బంది విద్యార్థినులను ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు 30 మంది కోలుకోగా వారిని శనివారం ఉదయం వసతి గృహానికి పంపించారు. మిగతా 12 మంది దవాఖానలో కోలుకుంటున్నారు. కోలుకుంటున్న విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ‘గాంధీ’ సినిమాకు వెళ్లిన విద్యార్థినులు బయట ఆహారం తినడంతో అస్వస్థతకు గురయ్యారని కొందరు, వసతి గృహంలోని రాత్రి భోజనం కారణంగానే జరిగిందని మరి కొందరు చెబుతున్నారు. ఈ విషయమై విచారణ జరుపుతున్నామని, నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని స్థానిక డిప్యూటీ తహసీల్దార్ వరలక్ష్మి తెలిపారు. కలుషిత ఆహారం కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో మత్తమాల ప్రాథమిక కేంద్రం ఆరోగ్య సిబ్బంది వసతి గృహంలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించారు.