గాంధారి, ఆగస్టు 20: మండలంలోని గుడిమెట్ గ్రామ సమీపంలో ఎత్తైన గుట్టపై, ప్రకృతి అందాల నడుమ కొలువైన మహాదేవుడు, ఎంతో మహిమ ఉన్నవాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలోని శివలింగం అతిపురాతనమైనదని, కోరికలు తీరుతాయని, చేపట్టిన పనులు సజావుగా జరుగుతాయని వారి విశ్వాసం. మండలంలోని ఏ గ్రామం నుంచి చూసినా ఈ ఆలయం కనిపిస్తుంది. గుట్టను దూరం నుంచి చూస్తే.. లింగాకారంలో ఉంటుంది. కొత్తగా పని ప్రారంభించాలనుకునే ప్రజలు మొదట ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ప్రతి శని, సోమవారాల్లో ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. శ్రావణ, కార్తీక మాసాల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
ఆలయ చరిత్ర..
మహాదేవుడి భక్తులైన శివ, శరములు సుమారు 800 ఏండ్ల క్రితం ఈ గుట్టపై శివ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు తెలుస్తుంది. గుట్టపై రెండు బసవన్నలు, సంతోషిమాత ఆలయం, 108(అష్టోత్తర శివలింగాలు), ద్వాదశ శివలింగాలతో పాటు వినాయకుడు, నాగేంద్రుడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. గుట్టపై ఎప్పుడూ నీటితో ఉండే కొలను ఉన్నది. గుట్టపైన ఉన్న ఆలయం శిథిలమవడంతో 1979లో బీమానంద మహరాజ్ గురు జంగముల వద్ద దీక్ష తీసుకొని ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఈ ఆలయంలో జంగమయ్యలు పూజారులుగా వ్యవహరిస్తారు.
గుడికి తొలిమెట్టే.. గుడిమెట్
కామారెడ్డి – బాన్సువాడ ప్రధాన రహదారికి పక్కన మహాదేవుని గుట్ట కలదు. మహాదేవుడిని దర్శించుకోవడానికి వెళ్లే తొలిమెట్టునే గుడిమెట్టు అంటారు. ఆ కారణంతోనే మహాదేవుని ఆలయ సమీపంలో ఉన్న గ్రామానికి గుడిమెట్టు అని పేరు వచ్చినట్లు పెద్దలు చెబుతారు. కాలక్రమేణా గుడిమెట్టు కాస్తా గుడిమెట్గా మారింది. దీనిని మహాదేవుడి గుట్ట అని కూడా పిలుస్తుంటారు.
మహిమ గల దేవుడు..
గుడిమెట్లోని మహాదేవుడు ఎంతో మహిమ గలవాడు. ఇక్కడి ఆలయంలోని శివ లింగాన్ని మనసారా మొక్కుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయి. మాఘశుద్ధ ఏకాదశి రోజు శివ పార్వతుల కల్యాణంతోపాటు మహా రుద్రాభిషేకం, రుద్రయాగం, రథోత్సవం తది తర కార్యక్రమాలను నిర్వహిస్తాం.
–సద్గురు ధర్మభూషణ్, గుడిమెట్
కోరికలు తీర్చే దేవుడు..
మా గ్రామ సమీపంలో గుట్టపై కొలువుదీరిన మహాదేవుడు.. భక్తుల కోరికలు తీరుస్తాడు. మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏ పనిని ప్రారంభించాలన్నా.. ముందుగా మహాదేవుడిని దర్శించుకుంటారు. అనంతరం పనులను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్నది.
–ఆర్ల రాజు, గుడిమెట్