లింగంపేట, మే 9: భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల అధారంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి, విచారణ చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్.. అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రెవెన్యూ శాఖ అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేసి లింగంపేటను పైలట్ మండలంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. రెవెన్యూ సదస్సుల్లో 4,225 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
దరఖాస్తుల పరిశీలన కోసం తొమ్మిది ప్రత్యేక బృందాలతో గ్రామాల్లో విచారణ చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 1,443 దరఖాస్తుల విచారణ పూర్తయ్యిందని, మిగతావాటిని త్వరితగతిన విచారణ చేపట్టాలన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమస్మాత్మకంగా ఉన్న భూములను సంయుక్తంగా సర్వే నిర్వహించాలని సూచించారు. దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ (రెవెన్యూ), బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, భూ భారతి ప్రత్యేకాధికారి రాజేందర్, ల్యాండ్ సర్వే సహాయ సంచాలకుడు శ్రీనివాస్, అటవీ అభివృద్ధి అధికారి రామకృష్ణ, ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ సురేశ్‌తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.