ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు ఏరులైపారుతున్నది. కొందరు ముఠాగా ఏర్పడి కల్తీ కల్లును తయారుచేస్తూ పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిషేధిత ఉత్ప్రేరకాల నుంచి తయారుచేసిన కల్లును విక్రయిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. కల్తీ కల్లు తాగిన వారు అనారోగ్యం పాలై దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు. మానసిక రుగ్మతల బారినపడగా.. వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కల్తీ కల్లును అరికట్టాలని ఆదేశించినా.. ఫలితం లేకుండా పోయింది.
కాంపౌండ్లలో కల్లీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కల్లు డిపోల్లోనే ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా ఆబ్కారీ శాఖ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. కల్తీకల్లుపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు చెత్తబుట్టలో వేస్తున్నారు. ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్చార్జి మంత్రిగా ఉన్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అడ్డూఅదుపులేకుండా కల్తీకల్లు దందా కొనసాగడం గమనార్హం.
-నిజామాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిద్ర మత్తులో ఎక్సైజ్ శాఖ
ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు యథేచ్ఛగా తయారుచేస్తున్నా ఆబ్కారీ శాఖ మాత్రం మొద్దు నిద్రను వీడడంలేదు. మామూళ్ల మత్తులో జోగుతుండడంతో డిపోల్లో కల్తీ కల్లు తయారీపై నిఘా పెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రాము క్లోరో హైడ్రెట్(సీహెచ్) రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ధర పలుకుతున్నది. జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాల్లో దళారుల ద్వారా సీహెచ్ను కల్లు కాంపౌండ్లకు తరలిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు, తెల్లవారుజామున కాంపౌండ్ నిర్వాహకులకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాకు ఒకరు చొప్పున సీహెచ్ సరఫరా చేసే బాధ్యతను తీసుకున్నట్లు సమాచారం. వీరికి కీలక నేతలు సహకారం అందిస్తున్నట్లు తెలిసింది. కల్లు డిపోలను నిర్వహించే బడా వ్యక్తుల ఇండ్లలోనే క్లోరో హైడ్రెట్ను రహస్యంగా నిల్వ ఉంచుతున్నట్లు సమాచారం.
తెల్లవారుజామునే కల్లు డిపోలో పని చేసే కార్మికుల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో సీహెచ్ విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నది. తయారీదారులకు అధికార పార్టీతో సత్సంబంధాలు ఉండడంతో వారిని మచ్చిక చేసుకుని స్నేహ సంబంధాలను నెరుపుతూ పలువురు వృత్తికే కళంకం తీసుకువస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్లు డిపోల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే నూటికి నూరు శాతం కల్తీ కల్లు దందా తేటతెల్లం అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు సీహెచ్ తరలిస్తున్న మధ్యవర్తులను, దళారులను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. కానీ దాని వెనుక దాగి ఉన్న అక్రమార్కుల చిట్టాను శోధించడంలో ఆబ్కారీ శాఖ వెనుకబడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.