నిజామాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కల్తీ కల్లు ఉప్పొంగుతున్నా, అమాయకుల ప్రాణాల మీదకు వస్తున్నా ప్రభుత్వంలో చలనం కరువైంది. నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణను గాలికొదిలేసింది. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లుతో వంద మంది దాకా అస్వస్తతకు గురైతే కనీసం స్పందించలేదు. ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు చేపట్టలేదు.
వాస్తవానికి ఎక్కడైనా కల్తీ కల్లు ఉదంతం వెలుగు చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి, అక్రమార్కుల భరతం పట్టాలి. కానీ ఆ దిశగా చర్యలే లేవు. మరోవైపు, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నప్పటికీ కల్తీ కల్లు ఘటనపై కనీస స్పందన రాలేదు. పదుల సంఖ్యలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా మంత్రి నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
కల్తీ కల్లుకు నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు. అధికారికంగా నిర్వహించే కల్లు బట్టీలకు రెట్టింపు స్థాయిలో కల్లు దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నది. కానీ ఆబ్కారీ శాఖకు కనిపించదు. కామారెడ్డి ఘటనతో నిజామాబాద్లో ఆబ్కారీ శాఖ మూడు రోజుల పాటు తనిఖీలకు సిద్ధమైంది. ఈ మేరకు ముందస్తుగానే కల్లు బట్టి నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు.
నిషేధిత పదార్థాలను మాయం చేశారు. దీంతో తనిఖీల సందర్భంగా అంతా సవ్యంగానే ఉన్నట్లుగా ఎక్సైజ్ శాఖ చెబుతున్నది. కానీ కల్తీ కల్లు లేని దుకాణమే నిజామాబాద్లో లేదన్నది బహిరంగ రహస్యం. నగరంలోని పలు డిపోల్లో నాణ్యమైన కల్లు దొరకడమే లేదు. కానీ ఆబ్కారీ తనిఖీల్లో మాత్రం లోపాలే బహిర్గతం కాకపోవడం విచిత్రంగా మారింది. అధికార పార్టీలో ఓ కీలక నేత పేరు చెప్పుకుంటూ ఓ వ్యక్తి నిజామాబాద్లో ఆల్ఫాజోలం దందాను నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సదరు నేతపై పోలీసులు దృష్టి సారించగా, పైనుంచి మందలింపులు వచ్చినట్లు సమాచారం.
ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యానికి, క్షేత్ర స్థాయిలో అక్రమ వ్యవహారాలకు దుర్కిలోని అనుమతి లేని కల్లు బట్టి నిర్వాహణే తేటతెల్లం చేస్తున్నది. క్షేత్ర స్థాయిలో సిబ్బంది సహకారంతో అక్రమ దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. అమాయకులు అస్వస్తతకు గురవడంతో ఆబ్కారీ శాఖ లీలలు బయటపడ్డాయి. కొద్ది రోజుల క్రితం కల్తీ కల్లు సేవించిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
కానీ ఆబ్కారీ శాఖ, పోలీసులు కనీసం ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేయలేదు. పోలీసులు అప్పుడప్పుడు ఆల్ఫాజోలం పట్టుకుంటున్నారు. అయితే, పోలీసులతో చేతులు కలిపి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన ఎక్సైజ్ శాఖ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. క్లోరోహైడ్రేట్గా తేలితేనే తమ పాత్ర ఉంటుందని ఆబ్కారీ శాఖ చెబుతున్నది. మిగిలిన మత్తు పదార్థాలతో తమకు సంబంధం లేదని, అదంతా పోలీసులే చూసుకుంటారని వదిలేస్తున్నారు.
బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని దామరంచ, అంకోల్, అంకోల్ క్యాంపు, దుర్కితో పాటు గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆయా గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది అస్వస్థతకు గురై దవాఖానలో చేరారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆబ్కారీ శాఖ పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టలేదు. అక్రమార్కులతో కొంత మంది సిబ్బంది కుమ్మక్కవడం, కల్లు తయారీలో నిషేధిత పదార్థాలను వినియోగిస్తున్నారని తెలిసినా పట్టించుకోకపోవడం ప్రజలకు శాపంగా మారింది.
నస్రుల్లాబాద్ ఘటన వెలుగు చూసిన వెంటనే యంత్రాంగం స్పందించి ఉంటే గాంధారి మండలం గౌరారం ఉదంతం జరిగేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కల్తీ కల్లు ఘటనతో అవాక్కైన అధికారులు తమ తప్పును సరిదిద్దుకునే క్రమంలో పలువురిపై కేసులు నమోదు చేశారు. ఒకటి, రెండు కల్లు బట్టీలను మూసేశారు. అయితే, అసలు సూత్రధారులను మాత్రం వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. కామారెడ్డిలో విస్తృత తనిఖీలు నిర్వహించి కేసులు పెట్టినప్పటికీ నిజామాబాద్లో తూతూ మంత్రంగానే తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్నారు.