వినాయక్‌నగర్, అక్టోబర్ 21: నిజామాబాద్, బోధన్ కోర్టుల ప్రాంగణాల్లో న్యాయస్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న న్యాయాధికారుల కోసం వసతి గృహాలను నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కాసోజు సురేందర్, లక్ష్మీనారాయణ అలిశెట్టి, వినోద్ కుమార్ సోమవారం వర్చువల్ ద్వారా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయస్థానా ల్లో విధులు నిర్వహిస్తున్న న్యాయాధికారులకు మౌలిక వసతుల కల్పన ముఖ్యమని పేర్కొన్నారు.
అనంతరం హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ కాసోజు సురేందర్ మాట్లాడుతూ.. నిజామాబాద్, బోధన్ కోర్టుల ప్రాంగణాల్లో న్యాయాధికారులు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాల శంకుస్థాపనకు శ్రీకారం చుట్టడం మౌలిక వసతుల కల్పనలో ఒకమెట్టుగా అభివర్ణించారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో లిఫ్ట్ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి మాట్లాడుతూ.. కోర్టు సముదాయాల్లోనే న్యాయాధికారులకు క్వార్టర్స్ ఉండడంతో త్వరతగతిన వారు కోర్టు విధులకు చేరుకోగలరని అన్నారు.
కోర్టు సముదాయాల్లో న్యాయాధికారులకు గృహ వసతి కల్పించడంవల్ల భద్రతాపరమైన సమస్యలు ఉండవని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ.. జిల్లాలో విధులు నిర్వహిసున్న న్యాయాధికారులకు సౌలభ్యకరంగా ఉండేలా నూతన భవన నిర్మాణాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు కనక దుర్గ, శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ, గోపీకృష్ణ, చైతన్యతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్, అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు.